వామపక్షాలు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి

29 May, 2019 13:13 IST|Sakshi

సాక్షి, విజయవాడ : భారతదేశంలో వామ పక్షాలు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయని, ఎర్ర జెండా పార్టీల పునరేకీకరణ జరగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. పునరేకీకరణ కోసం జూన్‌ నెలలో కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సీపీఐ పార్టీ తరపున అభినందనలు తెలియజేశారు. గడిచిన ఐదేళ్లలో నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. పుల్వామా ఘటనను సూడో నేషనలిజంగా చేశారని మండిపడ్డారు.

విజయవాడలో నిర్వహించే కార్యవర్గ  సమావేశాలలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో వామపక్షాలు, జనసేన, బీఎస్పీ నాలుగు పార్టీలు కలిసినా ఎన్నికల్లో  విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ బీజేపీకి లొంగిపోయిందని ఆరోపించారు. కమ్యూనిస్టు పార్టీలకు రాష్ట్రంలో అధికారం చేపడతామని సవాలు చేసే ధైర్యం లేదన్నారు.

మరిన్ని వార్తలు