సీఎంలిద్దరూ ‘భరత్‌ అనే నేను’ చూడాలి

24 Apr, 2018 12:24 IST|Sakshi
సీపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ

సాక్షి, హైదరాబాద్‌: కమ్యూనిస్టులపై బీజేపీ అసత్యప్రచారం చేస్తోందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. యూపీఏ ప్రభుత్వంలో స్కామ్‌లను కూడా కమ్యూనిస్టులకు అంటకడుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. తాము యూపీఏ1కు మాత్రమే మద్దతు తెలిపామని, యూపీఏ 2 ప్రభుత్వానికి కాదని గుర్తుచేశారు. యూపీఏ 2 హయాంలో జరిగిన కుంభకోణాలపై బీజేపీతో పాటు తాము కూడా పోరాటం చేశామని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే మొత్తం అవినీతిని బయట పెడతామని, విదేశాల నుంచి డబ్బు తెస్తామని ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ హామీయిచ్చారని కానీ అధికారంలోకి వచ్చి చేసిందేంటని రామకృష్ణ ప్రశ్నించారు. 

2జీ స్పెక్ట్రం కేసులో జైలుకు వెళ్లిన కనిమొళి, రాజా.. మోదీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఎక్కడున్నారన్నారు. యూపీఏ హయాంలో జైళ్లలో ఉన్న గాలిజనార్ధన్ రెడ్డి ఇప్పుడు బీజేపీ తరపున కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేస్తూ తన అనుచరులు 9 మందికి, తన తమ్ముడికి టికెట్ ఇప్పించుకున్నారని తెలిపారు. అవినీతిపరులకు టికెట్లు ఇచ్చారని, జైళ్లో ఉండాల్సిన యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ అవినీతి గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. 

‘బాబు, కేసీఆర్‌ భరత్ అనే నేను సినిమా చూడాలి’
‘భరత్ అనే నేను’ సినిమాను చంద్రబాబు, కేసీఆర్ జనంలో కూర్చోని చూడాలని, ముఖ్యంగా ఏపీ సీఎం చూడాలని రామకృష్ణ సూచించారు. ‘కాలేజీలు, స్కూళ్లు, ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టారు. బాబు ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తోంది. అమరావతిలో  రైతుల నుంచి లాక్కున్న భూములు 7 ప్రైవేట్ కాలేజీలకు దోచిపెట్టారు. స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ, ఎన్నికలు పెట్టడంలేద’ని మండిపడ్డారు.

కేసీఆర్ టీఆర్ఎస్ వాళ్లకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వరు.. బాబు సూటు బూటు ఉంటేనే కలుస్తారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాలన చేస్తున్నారా లేక రాచరికం చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఇవాళ ఏపీ వ్యాప్తంగా కేంద్రానికి నిరసనగా రాత్రి 7 గంటలకు అరగంట పాటు బ్లాక్ డే పాటిస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు నెరవేర్చాలని అరగంట లైట్లు బంద్ చేసి నిరసన తెలుపుతామని పేర్కొన్నారు. అందరూ బ్లాక్ డేకు సహకరించి స్వచ్చందంగా నిరసన తెలపాలని కోరారు.

>
మరిన్ని వార్తలు