చంద్రబాబు డబ్బుతో గెలవాలని చూస్తున్నారు : రామకృష్ణ

5 Dec, 2018 14:02 IST|Sakshi

సాక్షి, ప్రకాశం : బీజేపీ అధికారం చేపట్టిన తరువాత సంఘ్‌ పరివార్ శక్తులు దళితులు, మైనార్టీలపై దాడులకు పాల్పడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. గోసరంక్షణ పేరుతో 30 మందిని పొట్టనబెట్టుకున్నారని ఆరోపించారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... మైనార్టీలను రెచ్చగొట్టేందుకే ఎన్నికల వేళ బీజేపీ రామజన్మభూమి అంశాన్ని తెరపైకి తెచ్చిందని పేర్కొన్నారు. శబరిమలలో సుప్రీం కోర్టు ఆదేశాలు అమలుపరచరు గానీ మరిన్ని కొత్త హామీలు ఇస్తారంటూ ఎద్దేవా చేశారు.

చంద్రబాబు అలా చెప్పడం నిజంగా సిగ్గుచేటు..
రాష్ట్రంలో ఓ వైపు కరువు విలయతాండవం చేస్తోంటే సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం.. ఏపీలో వ్యవసాయం ఆశాజనకంగా ఉందని అమెరికాలో చెప్పడం నిజంగా సిగ్గుచేటని రామకృష్ణ విమర్శించారు. స్వార్థ రాజకీయాలకు పాల్పడుతూ, డబ్బు అనే అహంకార ధోరణితో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ, వైఎస్సార్‌ సీపీకి వ్యతిరేకంగా జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కూటమిలో జేడీ, జేపీ, చలసాని శ్రీనివాస్, పవన్, కమ్యూనిస్ట్ పార్టీలతోపాటు ప్రజాసంఘాలు, మేధావులు ఉంటారని పేర్కొన్నారు. ఇక.. మోదీ, కేసీఆర్‌ను గద్దె దించే లక్ష్యంతోనే తెలంగాణలోని కమ్యూనిస్టులు మహాకూటమి నేతలతో చేతులు కలిపారని రామకృష్ణ తెలిపారు.

మరిన్ని వార్తలు