‘కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ దానికోసమే’

5 Jun, 2018 16:56 IST|Sakshi
సురవరం సుధాకర్‌ రెడ్డి (‍పాత ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ : ‘సబ్‌ కా సాథ్‌ సబ్‌ కా వికాస్‌’ నినాదంతో ఊదరగొట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగేళ్ల పాలనలో కార్పొరేట్‌ శక్తులు మాత్రమే వికాసం చెందాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) నాలుగు సంవత్సరాల దుష్టపాలనలో రైతులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని అన్నారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ వాసులందరికీ మంచి రోజులు (అచ్చేదిన్‌) తెస్తామని చెప్పి గద్దెనెక్కిన మోదీ పాలనలో.. వ్యాపార వర్గాలకు మాత్రమే అచ్చేదిన్‌ వచ్చాయని ధ్వజమెత్తారు.

పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు విపరీతంగా పెంచి సామాన్యులను ముంచుతున్నారని మండిపడ్డారు. ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా సీపీఐ నేతృత్వంలో ఈ నెల 20న దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు. మోదీ నాలుగేళ్ల దుష్ట పరిపాలనపై ఆగస్టు 1 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు చేసిన రాజీనామాలు స్పీకర్‌ ఎందుకు ఆమోదించడం లేదో అర్థం కావడం లేదన్నారు.

వైఎస్సార్‌ సీసీ ఎంపీల రాజీనామాలను ప్రశ్నించే చంద్రబాబు, తొలుత ఆ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. షరతులు లేకుండా వస్తే వైఎస్సార్‌ సీపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమేనని ప్రకటించారు. కేసీఆర్‌ ప్రతిపాదించిన ఫెడరల్‌ ఫ్రంట్‌కు దేశ వ్యాప్త ప్రచారం లభించడం లేదన్నారు. మోదీకి వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న ప్రతిపక్షాల కూటమిని దెబ్బ కొట్టడానికే కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ భావన తెచ్చారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు