కేసీఆర్‌ అబద్ధాలకోరు.. అవకాశవాది 

23 Oct, 2018 01:29 IST|Sakshi

తెలంగాణ కాదు.. వారి కుటుంబమే బంగారుమయమైంది

ఆయన మరోసారి గెలిస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండదు

టీఆర్‌ఎస్‌ను ఎన్నోసార్లు ఆదుకున్నాం.. 

అయినా మమ్మల్నే హేళన చేస్తారా?

సీట్ల సర్దుబాటు గౌరవప్రదంగా లేకపోతే మహాకూటమికి రాంరాం

‘సాక్షి’  ఇంటర్వ్యూలో చాడ వెంకట్‌రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌ : సీఎం కేసీఆర్‌ అబద్ధాల కోరు, పచ్చి అవకాశవాదని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకోసం జరిగిన ఆత్మ బలిదానాలను, త్యాగాలను, అమరుల ఆకాంక్షలను బలిపెట్టి రాష్ట్రాన్ని కేసీఆర్‌ కుటుంబం కొల్లగొట్టిందని ఆయన ఆరోపించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అప్రజాస్వామిక, నియంతృత్వ ప్రభుత్వ పాలన ఉంటుందని ఎవరూ ఊహించలేదన్నారు. పొరపాటున మరోసారి కేసీఆర్‌ సీఎం అయితే ప్రజాస్వామ్యమే ఉండదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభకు ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’తో చాడ వెంకట్‌రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. 

తెలంగాణ సాధన ఆకాంక్షలు నెరవేరాయా? 
చాడ: లేదు. రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో అన్నివర్గాలు ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. దళితుడిని రాష్ట్రానికి తొలి సీఎం చేస్తానని, మాట తప్పితే తల నరుక్కుంటానని చెప్పిన కేసీఆరే ముఖ్యమంత్రిగా గద్దెనెక్కారు. ప్రమాణస్వీకారం తర్వాత దళితులు సహా అన్ని వర్గాలను మోసగించారు. మొత్తంగా రాష్ట్రాన్ని నిలువునా వంచించారు. తెలంగాణ అమరుల ఆకాంక్షలను మరిపించడానికి రోజుకో కొత్త డ్రామాతో ప్రజలను నయవంచన చేస్తూనే ఉన్నారు. 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైఫల్యాలేంటి? 
అన్ని రంగాల్లోనూ కేసీఆర్‌ విఫలమయ్యారు. ప్రజాస్వామ్యాన్ని పాతరేసే కుట్రలు చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా దళితులకు భూమి ఇచ్చారా? డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని రెండు ఊళ్లకు తప్ప మిగిలిన చోట్ల దిక్కులేదు. విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఉపాధి, వ్యవసాయం, మహిళలు ఇలా ప్రతి రంగంలో నయవంచనే. మిషన్‌ భగీరథ పేరుతో లక్షల కోట్లు ఖర్చు పెట్టి, పైపులు కొన్నారు. మరి గ్రామాలకు నీళ్లందుతున్నాయా? నీళ్లు ఇవ్వకుండా కోట్లాది రూపాయలతో పైపులైన్లు కమీషన్లకోసం కాదా? సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరుతో కోట్లాది రూపాయలను కమీషన్లుగా కేసీఆర్‌ కుటుంబం దండుకోవడం లేదా? సిరిసిల్లలో లారీల కింద దళితులను తొక్కిస్తూ కేసీఆర్‌ బంధువులు ఇసుక దోపిడీ చేయడం లేదా? బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్‌ కుటుంబమే బంగారు మయమైంది. ప్రజలు మాత్రం గతంలో ఉన్న సమస్యలతోనే బాధ పడుతున్నారు. 

ఉద్యమ సమయంలో కేసీఆర్‌తో దోస్తీ ఉన్న సీపీఐ ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తోంది? 
ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ, సమస్యలను పరిష్కరించాలని మేము కోరడమే కేసీఆర్‌కు నచ్చడం లేదు. ప్రజలన్నా, ప్రజల సమస్యలన్నా కేసీఆర్‌కు చులకనభావం పెరిగిపోయింది. తెలంగాణసాయుధ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణకోసం ఎన్నో పోరాటాలు చేశాం. నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు ఆత్మగౌరవ ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేశాం. ఇలాంటి రాష్ట్రంలో అమరుల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరాం. ప్రజల సమస్యలను వినడానికి ప్రతీ రోజూ కొంత సమయం కేటాయించాలని అడిగితే.. అది కేసీఆర్‌కు నచ్చలేదు. ఆయనకు భజన చేసేవారు తప్ప ప్రజల గురించి ప్రశ్నిస్తే నచ్చదు. 

ఇవి తప్ప కేసీఆర్‌ను వ్యతిరేకించేందుకు రాజకీయ కారణాలేవీ లేవా? 
రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. కేసీఆర్‌ ఒక నియంత, అవకాశ వాది. అవకాశం వచ్చేదాకా, అవసరం తీరేదాకా కాళ్ల బేరానికి వస్తాడు. ఓడదాటే దాక ఓడ మల్లన్న అని.. ఓడ దాటిన తర్వాత బోడ మల్లన్న అనే రకం. అధికారంలోకి వచ్చేముందు ఎన్నోసార్లు మమ్మల్ని కలిశాడు. అంతేకాకుండా 2014 ఎన్నికల్లో పొత్తు పెట్టుకుందామని ఆయనే ప్రతిపాదించాడు. ఆ తరువాత మాటమార్చాడు. పరకాల, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఉప ఎన్నికల్లో సీపీఐ మద్దతు లేకుంటే టీఆర్‌ఎస్‌ ఓడిపోయేదే. అప్పుడు కేవలం రెండు, మూడు వేల లోపు ఓట్లతోనే టీఆర్‌ఎస్‌ గెలిచింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కె.కేశవరావుకు మద్దతిచ్చాం. ఉద్యమానికి, తెలంగాణ వాదానికి నష్టం జరగొద్దని టీఆర్‌ఎస్‌కు వివిధ సందర్భాల్లో మద్దతుగా నిలిచాం. కానీ సీఎం అయ్యాక కేసీఆర్‌ తన అసలు రూపాన్ని బయటపెట్టుకున్నాడు. ప్రజల సమస్యలను పరిష్కారం చేయాలంటున్న సీపీఐని ‘అదో స్థూపాల పార్టీ అని, ఈక పార్టీ’అని అవహేళన చేస్తున్నాడు. 

సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువయ్యామనే ధీమా టీఆర్‌ఎస్‌లో కనిపిస్తోంది 
రైతుబంధు కింద ఎకరానికి రూ.4వేలు ఇస్తే రైతుల సమస్యలు తీరుతయా? కౌలు రైతులు రైతులే కారా? వ్యవసాయం చేయకున్నా వందల ఎకరాలున్న భూస్వాములకు లక్షల రూపాయలను పంచడం న్యాయమేనా? రైతులకు గిట్టుబాటు ధర, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు ఇచ్చి, శాస్త్రీయమైన ధరలతో పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తే రైతుల ఆత్మహత్యలు ఉండవు. ఖమ్మంలో గిట్టుబాటు ధర అడిగిన రైతులకు బేడీలు వేసిన కేసీఆర్‌ను ప్రజలు ఎలా మరిచిపోతారు? ధర్నాచౌక్‌ను ఎత్తేశారు. ప్రశ్నించిన వారిని అరెస్టు చేసి జైళ్లలో పెట్టారు. ఇలాంటి అప్రజాస్వామిక ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? రెండేళ్లుగా సచివాలయానికి రాని సీఎంగా కేసీఆర్‌ దేశంలోనే రికార్డు సృష్టించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగింది. మరోసారి కేసీఆర్‌ సీఎం అయితే రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే ఉండదు. తీవ్రంగా అణిచివేతలు, నిర్బంధాలు అమలవుతాయి. వార్డు సభ్యుని నుంచి ఎంపీ దాకా ఇతర పార్టీల నుంచి తన పార్టీలో చేర్చుకుని.. రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టించారు. 

అన్ని పార్టీలను ఏకం చేస్తున్నామంటూ సీపీఎంకు ఎందుకు దూరమవుతున్నారు? 
సీపీఎంకు మేమేం దూరం కావడం లేదు. టీఆర్‌ఎస్‌ను ఓడించడానికి కలిసి పనిచేయాలని కోరాం. కానీ సీపీఎం తొందరపాటుతో వ్యవహరించింది. బీఎల్‌ఎఫ్‌ పేరుతో ఒక కూటమిని ఏర్పాటుచేసి, తొందరపాటు నిర్ణయం తీసుకుంది. తనంతట తానుగానే సీపీఎం సొంత నిర్ణయం తీసుకుని, దూరం జరిగింది. ఒక వైఖరి తీసుకున్న తర్వాత సీపీఎంతో ఇంకా ఏం మాట్లాడతాం.

 

కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలని సీపీఎం నిర్ణయం తీసుకుంది కదా..! 
జాతీయస్థాయిలో అలాంటి నిర్ణయం తీసుకోలేదు. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌తో కలిశారు. కర్ణాటకలో రాహుల్‌తో కలిసి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వేదిక పంచుకున్నారు. అయినా అవన్నీ వారి అంతర్గత విషయాలు. అయితే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, వామపక్ష ఉద్యమాల విశాల ప్రయోజనాలను, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి టీఆర్‌ఎస్‌ను ఓడించాలని ప్రాథమికంగా అనుకున్నాం. అయితే కాంగ్రెస్‌తో కలిసేది లేదనే నిర్ణయం తీసుకుని, బీఎల్‌ఎఫ్‌ను ఏర్పాటుచేసుకున్నారు. దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి, అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌కు లాభం కలుగుతుందని భావిస్తున్నాం. మహాకూటమిని మాత్రమే టీఆర్‌ఎస్‌కు బలమైన ప్రత్యర్థి అని అన్నివర్గాలు నిర్ణయానికి వచ్చాయి. అయితే నేపాల్‌ తరహాలో వామపక్షపార్టీలన్నీ ఏకం కావాలని కోరుకుంటున్నాం. సీపీఐ ఈ ప్రయత్నాలను ఆపదు. 

వామపక్షాలు రోజురోజుకూ బలహీనం అవుతున్నాయనే విమర్శపై.. 
ఓట్లు, సీట్లు ఆధారంగా బలాబలాలు లెక్కగడుతున్న ఈ సమయంలో రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి, అయితే మేం బలహీన పడుతున్నామనడం సరికాదు. సరళీకృత ఆర్థిక విధానాల అమలులో వేగం పెరిగిన తర్వాత స్థానికంగా, జాతీయ, అంతర్జాతీయంగా చాలా రాజకీయ మార్పులు చోటుచేసుకున్నాయి, రాజకీయాల్లో సేవ, నిజాయితీ, చిత్తశుద్ధి స్థానంలో డబ్బు, ఇతర ప్రలోభాలు, అవసరాలు ప్రధానపాత్ర పోషిస్తున్నాయి, భూ ఆక్రమణలు, కబ్జాలు, అక్రమాలు చేసేవారు, కాంట్రాక్టర్లు, ఇతర మార్గాల్లో డబ్బు సంపాదించినవారే ప్రజా ప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. మీడియా కూడా కార్పొరేట్లు, ఎమ్మెన్సీల చేతుల్లోకి పోయింది. డబ్బు పాత్ర అపరిమితమైంది. ఇది వామపక్షపార్టీలకే కాదు, ప్రజాస్వామ్యానికే ప్రమాదం.

టీఆర్‌ఎస్‌ వేగాన్ని అడ్డుకోవడానికి మీరు అనుసరిస్తున్న వ్యూహమేంటి? 
టీఆర్‌ఎస్‌ వేగాన్ని ప్రజలే అడ్డుకున్నారు. ప్రగతి నివేదన సభ నాటికి, నేటికి ఉన్న పరిస్థితుల్లో చాలా తేడా ఉంది. పార్టీలో కేసీఆర్‌పై అసంతృప్తి బయటపడుతోంది. కేసీఆర్‌ను మంత్రులు, ఆపార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు కలిసే అవకాశమే లేకుండా పోయింది. రాష్ట్రమంతా కుటుంబసభ్యుల గుప్పిట్లో ఉంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను, ఆ పార్టీ నేతలే ఓడిస్తారు. ప్రతిపక్ష పార్టీలుగా అప్రజాస్వామిక, నియంతృత్వ పార్టీని ఓడించడానికి మేం మహాకూటమిని ఏర్పాటుచేసుకున్నాం. దీనిలో సీపీఐ ప్రధాన పాత్ర పోషిస్తోంది. టీజేఎస్‌తో కలిసి మొదలుపెట్టిన మహాకూటమిలో కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ ఇంటిపార్టీ భాగస్వాములుగా వస్తున్నారు. 
 

మహాకూటమిలో పొత్తుల పరిస్థితి ఏంటి? 
మహాకూటమి సీట్ల విషయంలో ఇంకా పూర్తిగా స్పష్టత రాలేదు. మొత్తంగా 12 స్థానాలకు తగ్గకుండా పోటీకి అవకాశం రావాలని కోరుతున్నాం. కనీసం 9 స్థానాలైనా రావాలని అనుకుంటున్నాం. గతంలో పోటీచేసిన స్థానాలకు తగ్గితే అంగీకరించబోం. గౌరవప్రదంగా సీట్ల సర్దుబాటు లేకపోతే మహాకూటమిలో సాగడం అసాధ్యమే. ఈ విషయంలో కాంగ్రెస్‌ జాప్యం చేస్తోంది. ఆలస్యం అవుతున్నా కొద్దీ సమస్యలు వస్తాయని ఆ పార్టీకి గతంలోనే చెప్పాం. అభ్య ర్థుల ప్రకటన, వనరుల సమీకరణ, అసంతృప్తులు, సర్దుబాట్లు చేసుకోవడానికి సమయం అవసరం. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించి, ప్రచారంలో ఉంది. ప్రతిపక్షంగా ఆ వేగంతో పనిచేయకపోతే తీవ్రనష్టం తప్పదు. 

మరిన్ని వార్తలు