హోదా కోసం ఉద్యమిస్తే అరెస్టులా?

25 Jul, 2018 04:02 IST|Sakshi

వామపక్ష నేతలు మధు, రామకృష్ణ ఖండన

సాక్షి, అమరావతి:  ప్రత్యేక హోదా కోరుతూ జరిగే ఆందోళనను అణగదొక్కడం అంటే పరోక్షంగా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చడమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు.  కేంద్రం చేసిన విద్రోహానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన బంద్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్భంధాన్ని ప్రయోగించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. బంద్‌ చేస్తున్న ఉద్యమకారుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ మంగళవారం వారు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. నాలుగు సంవత్సరాల పాటు బీజేపీతో అంటకాగిన టీడీపీ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ఇప్పుడు గగ్గోలు పెడుతోందని ఎద్దేవా చేశారు.

ప్రత్యేక హోదా కావాలంటూ దీక్షలు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం..  బంద్‌ను విఫలం చేయడానికి నిర్బంధాన్ని ప్రయోగించడం ఆక్షేపణీయమని తప్పుబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని అణచివేసే చర్యలు విడనాడాలని వారు హితవు పలికారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం విద్యార్థి, యువజన సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(జేఏసీ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగే ‘మానవహారం’ను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. విజయవాడ దాసరి భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కోటి మందితో మానవహారం నిర్వహించాలని జేఏసీ నిర్ణయించిందన్నారు. 

మరిన్ని వార్తలు