‘ఎర్ర’ పొత్తు పొడిచేనా?

9 May, 2018 02:31 IST|Sakshi

  చెరోదారిలో సీపీఎం, సీపీఐ 

  బీఎల్‌ఎఫ్‌ ఏర్పాటు చేసిన సీపీఎం 

  టీజేఎస్, టీడీపీతో కూటమిగా సీపీఐ 

  ‘లెఫ్ట్‌’మధ్య సయోధ్యకు నేతల తర్జనభర్జన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సీపీఎం, సీపీఐ మధ్య సయోధ్యపై ఇరుపార్టీల ముఖ్య నేతల్లో తర్జనభర్జన జరుగుతోంది. పార్టీల రాజకీయ తీర్మానాల్లో సారూప్యత ఉన్నా.. నాయకులు చెరోదారిలో నడుస్తుండటంతో కలసి పని చేయడంపై సందేహం వ్యక్తమవుతోంది. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోడానికి వామపక్ష పార్టీలతోపాటు సర్కారుకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ లను సమీకరించాలని, కానీ రెండు పార్టీల మధ్యే ఐక్యత కొరవడిందంటూ నేతలు వాపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు ఎర్రజెండాలు పరస్పరం పోటీపడతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ‘ఎర్ర’పార్టీల మధ్య సయోధ్య కుదరకపోవడానికి సీపీఎం కారణమంటూ సీపీఐ నేతలు, సీపీఐ నేతల వ్యవహారశైలే కారణమని సీపీఎం నేతలు ఒకరిపైఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.  

బీఎల్‌ఎఫ్‌ వేదికగా సమావేశాలు.. 
బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) పేరుతో వివిధ పార్టీలు, సామాజిక ఉద్యమ సంఘాలను సీపీఎం ఏకం చేస్తోంది. సీపీఐ లేకుండానే ఏర్పాటైన ఈ ఫ్రంట్‌.. వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తోంది. మరోవైపు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇటీవల పాదయాత్ర నిర్వహించి పార్టీలో కదలిక తీసుకొచ్చారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీగా క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను అధిగమించడానికి పాదయాత్ర ఉపయోగపడిందని నేతలంటున్నారు. ప్రజల సమస్యలపై పోరాడటానికి అగ్రభాగంలో ఉంటామనే సందేశాన్నీ ఇవ్వగలిగామని చెబుతున్నారు.

పాదయాత్రకే పరిమితం కాకుండా బీఎల్‌ఎఫ్‌ నిర్మాణానికి సీపీఎం ప్రణాళిక రచిస్తోంది. 3 నెలలపాటు నిర్మాణం, కార్యాచరణపై దృష్టి పెడతామని చెబుతోంది. మండల, నియోజకవర్గ స్థాయిలో నిర్మాణాన్ని నెలలో పూర్తి చేసుకోవాలని ఇటీవల జరిగిన బీఎల్‌ఎఫ్‌ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. ఆ తర్వాత బీఎల్‌ఎఫ్‌ వేదిక ద్వారానే నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. సీపీఐ లేకుండానే సీపీఎం కార్యాచరణకు దిగడం, 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించడంతో రెండు పార్టీల మధ్య ఐక్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  

టీడీపీ, జనసమితితో సీపీఐ చర్చలు 
టీఆర్‌ఎస్‌ను ఓడించాలన్న లక్ష్యం ఉన్నప్పుడు ప్రతిపక్షాల మధ్య ఓట్ల చీలిక నివారించాలని సీపీఐ వాదిస్తోంది. కానీ బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ పేరుతో సీపీఎం ఏకపక్షంగా పోతూ ప్రతిపక్ష పార్టీల మధ్య ఐక్యతకు గండికొడుతోందని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నందున తొందరపడకుండా అన్ని పార్టీలను ఏకం చేయాలంటున్నారు. ఇందులో భాగంగా కోదండరాం నేతృత్వంలోని జనసమితి (టీజేఎస్‌)తో సీపీఐ నేతలు చర్చలు జరుపుతున్నారు. టీడీపీతోనూ తెలంగాణలో కలసి పనిచేయాలనే ప్రయత్నంలో పార్టీ నేతలున్నారు. సీపీఐ, జనసమితి, టీడీపీ వంటి పార్టీల్లేకుండా బీఎల్‌ఎఫ్‌తో టీఆర్‌ఎస్‌ను ఓడించడం సాధ్యమేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సీపీఎం లేకుండా పనిచేస్తే ప్రజల్లోకి సరైన సంకేతాలు కూడా వెళ్లవేమోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు