ఏపీ స్థానిక పోరు: ఒంటరిగా సీపీఎం పోటీ

10 Mar, 2020 14:00 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని సీపీఎం పార్టీ నిర్ణయించింది. సిద్ధాంతాలకు విరుద్ధంగా కూటమికట్టిన టీడీపీ, సీపీఐలకు దూరంగా ఉండాలని పార్టీ ముఖ్యనేతలు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం విజయవాడలో సీపీఎం ముఖ్యనేతలు సమావేశమై.. స్థానిక సంస్థల ఎన్నికలపై అనుసరిచాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను  మీడియా సమావేశంలో వెల్లడించారు. బీజేపీ, టీడీపీ కూటములతో కాకుండా భావసారూప్యత గల చిన్న చిన్న పార్టీలతో కలిసి ముందుకెళ్లాలనే కామ్రేడ్లు నిర్ణయించారు.

చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో ప్రజా వ్యతిరేక విధానాలకు, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని ఈ నేపథ్యంలో వారితో పొత్తుకు దూరంగా ఉండాలని సీపీఎం అభిప్రాయపడింది. అధికారంలో ఉండగా చంద్రబాబు ఏనాడూ వామపక్షాలను లెక్క చేయలేదని, వివిధ సందర్భాల్లో ప్రజా సమస్యలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయమన్న పట్టించుకోలేదని పేర్కొన్నారు. అధికారం పోయిన తరువాత వామపక్షాలు గుర్తుకు వచ్చాయా అంటూ సీపీఎం నేతలు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాగా స్థానిక సంస్థలతో పాటు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ టీడీపీ-సీపీఐ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు