సీపీఎం తర్జన.. భర్జన

10 Mar, 2018 12:05 IST|Sakshi

బీఎల్‌ఎఫ్‌కు నాయకత్వం వహిస్తున్న సీపీఎం

ఉమ్మడి జిల్లాలో పన్నెండు అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలకు పోటీ 

సామాజిక సమీకరణల మేరకే కేటాయింపులు

సగం సీట్లు బీసీలకే అంటున్న నాయకత్వం

దీటైన అభ్యర్థుల కోసం వెతుకులాట

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : సీపీఎం.. ఎన్నికల కసరత్తు మొదలు పెట్టింది. బహుజన తెలంగాణ, సామాజిక న్యాయం ఎజెండాతో ఆ పార్టీ పురుడు పోసిన బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) తరఫున ఈ సారి ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని 12 అసెంబ్లీ, 2 లోక్‌సభా నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. మొత్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులు, ఆయా పార్టీల బలం బలహీనతలపై చర్చించి, దానికనుగుణంగా వ్యూహం ఖరారు చేసుకునేందుకు ఆ పార్టీ నాయకత్వం శుక్రవారం భేటీ అయ్యింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల కార్యదర్శివర్గాలతో సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో సీపీఎంకు పట్టున్న జిల్లాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఒకటి. ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఎల్‌ఎఫ్‌ ద్వారానే అన్ని నియోజకవర్గాల్లో ఉనికి చాటుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సీపీఎం మహాసభలను నల్లగొండలోనే నిర్విహించింది. గతంలో ఆ పార్టీ తుంగతుర్తి, నకిరేకల్, నల్లగొండ, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాలు, మిర్యాలగూడలోక్‌సభా స్థానం నుంచి పలు దఫాలు ప్రాతినిధ్యం వహించింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని పార్టీని మరింతగా విస్తరించేందుకు, సామాజిక న్యాయం ఎజెండాతో సబ్బండ వర్గాల ఓట్లను కొల్లగొట్టేందుకు పావులు కదుపుతోంది. 

రాజకీయ పక్షాలపై అంచనా !
ఈసారి ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి ఎలా ఉంది? ఆయా నియోజకవర్గాల్లో ఆయా పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎవరు? వారి పరిస్థితి ఎలా ఉంది? సీపీఎం తరఫున, లేదంటే బీఎల్‌ఎఫ్‌ తరఫున వారిని ఢీకొనే స్థాయిలో ఉన్న నాయకులు ఎవరూ అన్న విషయాలనూ కూలంకశంగా చర్చించారని సమాచారం. అదీ కాకుండా, సామాజిక అంశాలను ముందు పెట్టి ఏ పార్టీని ఎలా ఇరుకున పెట్టాలి? అసలు ఆయా పార్టీల ఎజెండా ఏమిటో ప్రజలకు వివరించేలా ఒత్తిడి పెంచే వ్యూహంపై కూడా కసరత్తు చేశారని చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అధికార టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ థర్డ్‌ ఫ్రంట్‌ పేరును తెరపైకి తెచ్చారని, అన్ని సమస్యల పెండింగ్‌కు, హామీలు నెరవేర్చక పోవడానికి బీజేపీ ప్రభుత్వమే కారణమని సాకులు చెప్పేందుకు చేస్తున్న ప్రయత్నాలని, వీటిని ప్రజల్లోకి  తీసుకువెళ్లి చర్చకు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. 

అభ్యర్థుల అన్వేషణ
బీఎల్‌ఎఫ్‌ ఆవిర్భావ సమయంలో సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయగల సత్తా ఉన్న అభ్యర్థులను అన్వేషించే అంశంపైనా చర్చ జరిగిందంటున్నారు. మొత్తం పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీపీఎం తరఫున ఎన్ని స్థానాల్లో, ఏయే స్థానాల్లో నిలబెట్టాలి? బీఎల్‌ఎఫ్‌లోని ఇతర భాగస్వామ్య పక్షాల నుంచి ఎవరికి ఎక్కడ బలం ఉంది? ఎవరికి ఏ నియోజకవర్గం అయితే ప్రభావవంతంగా ఉంటుం దన్న అంశంపైనా చర్చించారని చెబుతున్నారు. దీనిలో భాగంగానే కేవలం జిల్లాలో ఉంటున్న వారే కాకుండా, జిల్లాకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు, బయటి ప్రాంతాల్లో ఉంటున్న వారెవరినైనా ఆహ్వానించాలని, వారి స్థాయి ని అధ్యయనం చేయాలని కూడా నిర్ణయించారు. నల్లగొండ లోక్‌సభా స్థానం నుంచి సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తారని, పన్నెండు అసెంబ్లీ స్థానాలను గెలచుకుంటామని టీఆర్‌ఎస్‌ నాయకత్వం ప్రచారం చేస్తున్న క్రమంలో.. కేసీఆర్‌ నల్లగొండ నుంచి పోటీ చేస్తే ఆయనపై పోటీ దింపడానికి దీటైన అభ్యర్ధి ఎవరు? బలమైన నేతలు ఎవరు? అన్న అంశాలపై అంచనాకు రావాలని, ఆ తర్వాత ప్రత్యేక వ్యూహం రచించుకో వాలని సీపీఎం నిర్ణయించినట్లు తెలిసింది. బీఎల్‌ఎఫ్‌ లో చేరని సీపీఐ తదితర పార్టీలను తమ వైపు తిప్పుకోవడం ద్వారా మరింత బలపడొచ్చన్నది సీపీఎం వ్యూహంగా కనిపిస్తోంది. సీపీఐ గతంలో దేవరకొండ, మునుగోడు, రామన్నపేట (రద్దు కాకమునుపు) నియోజకవర్గాల్లో, సీపీఎం పొత్తుతో నల్లగొండ లోక్‌సభా స్థానంలో గెలిచింది. సీపీఎం, సీపీఐ కలిసి ఎన్నికలకు వెళితే ఉమ్మడి జిల్లాలో కలిసొచ్చే అంశాలపైనా చర్చించినట్లు సమాచారం.  

మరిన్ని వార్తలు