‘జనసేనతో పొత్తుపై త్వరలో క్లారిటీ’

15 Sep, 2018 14:02 IST|Sakshi

సాక్షి, విజయవాడ: దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందుతూ నూతన రికార్డులు సృష్టిస్తోందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందా కారత్‌ ఎద్దేవా చేశారు. శనివారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. నొట్ల రద్దు కారణంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 లక్షల మంది ఉపాధి కోల్పోయారని మండిపడ్డారు. జీఎస్టీ రూపంలో ప్రజలపై విపరీతమైన పన్నుల భారం మోపారని దుయ్యబట్టారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలలో నరేంద్ర మోదీ ప్రభుత్వం నూతన రికార్డులు సృష్టిస్తోందని చురకలు అంటించారు. మోదీ హయాంలో దేశంలో మతతత్వ దాడులు పెరిగాయని ఆరోపించారు. భవిష్యత్తులో మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా దేశంలో సీపీఎం నూతన ప్రత్యమ్నాయంగా బలోపేతం చేస్తామని బృందాకారత్‌ స్పష్టం చేశారు.

మోదీ, బాబులు ఇద్దరూ ఒక్కటే..
ఏపీ సీఎం చంద్రబాబు నాయడు మోదీకి వ్యతిరేకంగా ఇప్పుడు పోరాడుతున్నారని, కానీ నాలుగేళ్లు వారితోనే కలిసి పనిచేశారని విమర్శించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన మోదీ ఆర్థిక విధానాలను టీడీపీ ప్రభుత్వం సమర్థించిందని గుర్తుచేశారు. ఏపీలో జనసేనతో కలిసి టీడీపీ, బీజేపీలకు వ్యతిరేకంగా కలిసి పనిచేస్తామని తెలిపారు. జనసేనతో ఎన్నికల పొత్తుపై అక్టోబర్‌లో స్పష్టత ఇస్తామని బృందాకారత్‌ పేర్కొన్నారు.
    
   

మరిన్ని వార్తలు