ఆర్మీ చీఫ్‌కు రాజకీయాలతో పనేంటి?

29 Dec, 2019 02:10 IST|Sakshi

సైన్యాధ్యక్షుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చరిత్రలోనే మొదటిసారి

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

సాక్షి, హైదరాబాద్‌: దేశ ప్రజలను రాజకీయ నాయకులు తప్పుదోవలో నడిపిస్తున్నారంటూ ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ చేసిన వ్యాఖ్యలను సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తప్పుబట్టారు. అసలు ఆర్మీ చీఫ్‌కు దేశ అంతర్గత రాజకీయాలతో పనేంటని ఆయన ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఆర్మీ చీఫ్‌ రాజకీయాల గురించి మాట్లాడటం ఇదే మొదటిసారని, సాయుధ దళాల్లో కూడా రాజకీయ జాడలు కనిపించడం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రా ల పర్యటన సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన ఏచూరి శనివారం సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

ఆర్మీ చీఫ్‌ రాజకీయాలు మాట్లాడే ధోరణి దేశాన్ని మరో పాకిస్తాన్‌లా మారుస్తుందన్న విషయాన్ని గ్రహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేని, కానీ కేంద్ర మంత్రులు కూడా రావత్‌ వ్యాఖ్యలను సమర్థిస్తూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌ (ఎన్‌పీఆర్‌)ను 2003లో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే హోంమంత్రి అద్వానీ పార్లమెంటులో ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. 2014లో రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో కూడా దేశవ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేస్తామని చెప్పారని, ఇది పార్లమెంటు రికార్డుల్లో ఉందన్నా రు. కానీ మోదీ మాత్రం దేశవ్యాప్తంగా ఎన్నార్సీ గురించి తాము చర్చించలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

హింసకు పోలీసులే కారణం
దేశంలో జరుగుతున్న హింసా ఘటనలకు పోలీసులే కారణమని, వారే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ ప్రజలపై ఆరోపణలు చేస్తున్నారని ఏచూరి ఆరోపించారు. తాము ప్రజల మీద ఒక్క బుల్లెట్‌ కూడా ప్రయోగించడం లేదని కేంద్రం చెబుతుంటే.. దేశవ్యాప్తంగా ఎన్నార్సీ ఆందోళనల్లో 27 మంది ఎలా చనిపోయారని ప్రశ్నించారు. ప్రభుత్వాలు నిరూపించేంత వరకు ఈ దేశంలో నివసించే వారంతా దేశ పౌరులేనని, కానీ కేంద్రం మాత్రం ప్రజలు దేశ పౌరులని నిరూపించుకునేంత వరకు ఈ దేశ పౌరులు కాదని అంటోందని ఎద్దేవా చేశారు. ఇది కచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందన్నారు. ఎన్నార్సీని అమలు చేయడం లేదని 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పారని, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా తన వైఖరిని స్పష్టం చేయాలని ఏచూరి డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌ డబుల్‌ డ్రామా.. 
సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌ విషయాల్లో సీఎం కేసీఆర్‌ డబుల్‌ డ్రామా ఆడుతున్నారని అర్థమవుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఎంఐఎంతో ఉన్న స్నేహం కారణంగా ముస్లింల ఓట్లు కావాలి కాబట్టి సీఏఏ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించారన్నారు. ఇటీవల పత్రికల్లో వస్తున్న వార్తల ఆధారంగా సీఎం కేసీఆర్‌ తన వైఖరిని మార్చుకున్నారని అర్థమవుతోందని, అది నిజం కావాలని తాము కోరుకుటుంటున్నామన్నారు.

మరిన్ని వార్తలు