‘ఎస్పీ రాజకీయ నేతగా వ్యవహరించకూడదు’

31 Aug, 2018 14:26 IST|Sakshi

సాక్షి, విజయవాడ‌: టీడీపీ ప్రజల నుంచి దూరమవుతోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలు మరింత ప్రస్ఫుటం అవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ హామీలు నెరవేరలేదనే సీఎం సభలో ముస్లిం యువకులు ప్రశ్నించారని పేర్కొన్నారు. ప్లకార్డులు చూపినందుకు నాన్‌బెయిల్‌బుల్‌ కేసులు పెట్టారు.. సీఎం సభలో జరిగిన దానిని వైఎస్సార్‌సీపీ కుట్ర అని చెప్పడం దారుణమని మండిపడ్డారు. ఎస్పీ ఒక అధికారిగా ఉండాలే కానీ.. రాజకీయ నేతగా కాదని అభిప్రాయపడ్డారు. అధికారులు ఇలా బరితెగించి మాట్లాడటం సరికాదని హితవుపలికారు.

చంద్రబాబుది చాలా దుర్మార్గమైన ప్రభుత్వం అని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై చంద్రబాబు సర్కార్‌ యుద్ధం చేస్తోందని మండిపడ్డారు. ఉండవల్లిలో రైతుల అనుమతి లేకుండా విద్యుత్‌ వైర్లు ఎలా వేస్తారని నిలదీశారు. ప్రభుత్వ వ్యతిరేక చర్యలను అడ్డుకున్న రైతులను అరెస్ట్‌ చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో మైనార్టీలకు, గిరిజనులకు, దళితులకు భద్రత లేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా చంద్రబాబు చేసిన అభివృద్ధి అని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నించేవారిని అరెస్ట్‌లు చేసి కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఈ వైఖరికి నిరసనగా బంద్‌కు సైతం పిలుపునిస్తామని తెలిపారు. ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు