క్వారీలో ఇష్టారాజ్యంగా మైనింగ్‌

4 Aug, 2018 12:06 IST|Sakshi
సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు(పాత చిత్రం)

విజయవాడ: కర్నూలు జిల్లా క్వారీ పేలుడు ఘటనపై సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు స్పందించారు. విజయవాడలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆలూరు మండలం హత్తిబెళగల్‌ కొండ క్వారీలో ఇష్టారాజ్యంగా మైనింగ్‌ జరుగుతుందని, ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు పెడచెవిన పెట్టడంతోనే ఈ ఘటన జరిగిందని అన్నారు. వీటిని టీడీపీ ప్రభుత్వ హత్యలుగా భావించాలని పేర్కొన్నారు.  కార్మికులకు భద్రతా చర్యలు లేవని, లేబర్‌ డిపార్ట్‌మెంట్‌పై కేసులు పెట్టకుండా ఉండాలన్నదే టీడీపీ ఉద్దేశ్యంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

వలస కూలీలకు సంబంధించి లేబర్‌ రూల్‌ ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు వస్తే కార్మిక శాఖ రిజిస్టర్‌లో నమోదు చేయాలి..కార్మికులు ఏ కంపెనీలో పని చేస్తారో ఆ కంపెనీ రిజిస్టర్లో కూడా నమోదు చేయాలి..కానీ అలా చేయడం లేదని చెప్పారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ అంటే ప్రజలకు రక్షణ లేకుండా చేస్తోందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం చట్టాలపై పునరాలోచన చేయాలని సూచించారు. గ్రామదర్శిని టీడీపీ ప్రచార కార్యక్రమంలా మారిందని, అది ఒట్టి బోగస్‌ కార్యక్రమమని విమర్శించారు. క్వారీ ఘటనపై అన్ని రాజకీయపక్షాలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బీజేపీ, టీడీపీలు రోజురోజుకూ బలహీనపడుతున్నాయని వ్యాఖ్యానించారు.

 ‘టీడీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. విద్యార్థులపై దాడులు, నాయకుల అక్రమ అరెస్ట్‌లు జరుగుతున్నాయ్‌. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి. నెల్లూరు జిల్లా రాపూర్‌లో వామపక్షాలు పర్యటిస్తాయి. దళితులు, విద్యార్థులు, కార్మికుల రక్షణ కోరుతూ సెప్టెంబర్‌ 15న రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్నా’ మని వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు