‘లాల్‌’ జెండా.. ‘నీల్‌’ ఎజెండా

16 Apr, 2018 01:16 IST|Sakshi

వర్గ, సామాజిక జమిలి పోరాటాల దిశగా సీపీఎం 

ఈ నెల 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో సభలు

సాక్షి, హైదరాబాద్‌: సీపీఎం చరిత్రలో మరో అధ్యాయానికి తెలంగాణ వేదిక కాబోతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ వేదికగా ఈ నెల 18 నుంచి 22 వరకు పార్టీ 22వ జాతీయ మహాసభలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 764 మంది ప్రతినిధులు ఈ సభలకు హాజరై పలు కీలకాంశాలపై పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించనున్నారు.

పార్టీ నియమావళిలో పేర్కొన్న వర్గ పోరాటాలకు తోడు సామాజిక అంశాన్ని కూడా చేర్చనున్నారు. వర్గ, సామాజిక జమిలీ పోరాటాలతో పార్టీని బలోపేతం చేసుకునే దిశగా చరిత్రాత్మక నిర్ణయాన్ని ఈ మహాసభల్లోనే తీసుకోనున్నారు. పార్టీ సైద్ధాంతిక మౌలిక స్వరూపాన్ని సామాజిక ఉద్యమాల దిశగా మార్చుకోవడంతోపాటు దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని ఏర్పాటు చేసేందుకూ ఆమోదం తెలపనున్నారు.

పోరాట పంథా ఇక కొత్తగా..
ఇన్నాళ్లూ వర్గ పోరాట దృక్పథంతో ముందుకెళ్తున్నా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉద్యమాల రూపకల్పన జరగడం లేదని సీపీఎం భావిస్తోంది. అందులో భాగంగానే విశాఖపట్నంలో 2015లో జరిగిన పార్టీ 21వ జాతీయ మహాసభలో ఈ అంశంపై చర్చ జరిగింది.

గత 30 ఏళ్ల నయా ఆర్థిక విధానాల కారణంగా దేశ మౌలిక స్వరూపంలో మార్పు వచ్చిందని, ప్రజా సమస్యల్లో వైరుధ్యం వచ్చిందన్న అంచనాకు పార్టీ వచ్చింది. కార్పొరేట్‌ సంస్కృతి కార్మిక వర్గ పోరాటాలను దెబ్బతీసిందనే నిర్ధారణకు వచ్చింది. అందులో భాగంగానే వర్గ, సామాజిక జమిలి పోరాటాలు చేయాలన్న చర్చ జరిగినా తుది నిర్ణయం తీసుకోలేదు.

ఆ తర్వాత 2015 డిసెంబర్‌లో జరిగిన కోల్‌కతా మధ్యంతర సమీక్షలో వర్గ, సామాజిక జమిలి పోరాటాల దిశగా ప్రయాణం చేయాలని తీర్మానించింది. కానీ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో మాత్రమే ఆ దిశలో ప్రయత్నాలు జరిగాయి. ఈ నేపథ్యంలో మహాసభల్లో సామాజిక అంశాన్ని పార్టీ కార్యక్రమంలో అధికారికంగా చేర్చి పోరాట కార్యాచరణను రూపొందిస్తారని, లాల్‌ జెండా.. నీల్‌ ఎజెండా బాటలో పయనిస్తుందని పార్టీ వర్గాలంటున్నాయి.

మతోన్మాదంపై పోరాటమే ...
రాజకీయ విధానాల విషయానికి వస్తే దేశంలో మతోన్మాదంపై పోరాటమే ప్రధాన ఎజెండాగా  చర్చ ఉంటుందని సమాచారం. దేశంలోని తాజా పరిణామాలు, దళితులు, మైనార్టీలపై దాడుల వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనుంది.

సంఘ్‌ పరివార్‌పై పోరాట కార్యాచరణ రూపొందించుకుని దేశవ్యాప్తంగా సామాజిక శక్తులను ఐక్యం చేయాలని నిర్ణయం తీసుకోనుంది. ఎన్నికల ఎత్తుగడల్లో భాగంగా ఎన్డీఏ కూటమిని గద్దె దించడమే లక్ష్యంగా పోరాటం చేయాలని, మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పని చేయాలని, దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని ఏర్పాటు చేయాలని  కేంద్ర కమిటీ తీసుకున్న నిర్ణయానికి కూడా ఈ సభల్లో ఆమోదముద్ర లభించనుంది.

కేసీఆర్, చంద్రబాబు దొందూ దొందే
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కేసీఆర్, చంద్రబాబులు అవకాశ వాద రాజకీయాలు చేస్తున్నారని, వారికి దూరంగానే ఉండాలని సీపీఎం భావిస్తోంది. ఫెడరల్‌ ఫ్రంట్‌ విషయంలో కేసీఆర్‌ ప్రయత్నాలు, ఇన్నాళ్లూ బీజేపీతో అంటకాగిన చంద్రబాబుల విషయంలో రాజకీయ వైరంతోనే ముందుకెళ్లాలని భావిస్తోంది. తెలంగాణలో ఏర్పాటు చేసిన బీఎల్‌ఎఫ్‌ గొడుగు కిందకు సామాజిక శక్తులను తీసుకురావాలని, కోదండరాం ఏర్పాటు చేసిన జనసమితి, ఇతర వామపక్షాలతో పనిచేయాలనే ఆలోచనలో ఉంది.

అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి
సీపీఎం 22వ జాతీయ మహాసభలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మహాసభల్లో పార్టీ రాజకీయ పంథాతో పాటు మతోన్మాద రాజకీయాలను తిప్పి కొట్టే అంశంపై ప్రతినిధుల సభ చర్చిస్తుంది. దేశంలోని రాజకీయ పరిస్థితులు, ఆర్థిక, సామాజిక దోపిడీలపై చర్చించి పార్టీ భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించుకుంటాం.   – జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మహాసభల ప్రచార కమిటీ కన్వీనర్‌

మరిన్ని వార్తలు