ఈఎస్‌ఐ కుంభకోణాన్ని నిరసిస్తూ సీపీఎం ధర్నా

23 Feb, 2020 03:31 IST|Sakshi
గుణదలలోని ఈఎస్‌ఐ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు

దోపిడీకి పాల్పడిన వారిని అరెస్ట్‌ చేయాలని నేతల డిమాండ్‌  

రూ.600 కోట్లకుపైగా అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం

లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో కనీస మందులు, వైద్యులు లేకున్నా పట్టించుకోకుండా గత పాలకులు వందల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడటం దారుణం అని సీపీఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఐదేళ్లలో సుమారు రూ.600 కోట్లకు పైగా అవినీతి బట్టబయలైందని స్పష్టం చేసింది. టెలిమెడిసిన్‌ పేరుతో, మందుల కొనుగోళ్లలో, ఆపరేషన్లలో కార్మికుల సొమ్మును దోచుకున్నారని ధ్వజమెత్తింది. గత ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వ అధికారులు దీనికి బాధ్యత వహించాలని.. ఇందుకు కారణమైన వారందరిపై ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శనివారం విజయవాడలోని గుణదలలో ఈఎస్‌ఐ కార్యాలయం ఎదుట ఆ పార్టీ ధర్నా నిర్వహించింది.

ఈ సందర్భంగా కార్మికులు, ఉద్యోగుల సొమ్మును దోచుకున్న ఈఎస్‌ఐ అధికారులు, రాజకీయ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు నినాదాలు చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ.. అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకులను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. టెండర్లు పిలవకుండా నామినేషన్‌ పద్ధతిలో దోచుకున్న సొమ్మును వారి వద్ద నుంచి రికవరీ చేయాలన్నారు. ఈఎస్‌ఐలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని, చందాదారులైన కార్మికులు, ఉద్యోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.  

ఈఎస్‌ఐలో కనీస మందులు లేవని, డాక్టర్లు కూడా సరిగా ఉండరన్నారు. విజయవాడ ఆస్పత్రి కూలిపోతుంటే పట్టించుకునే దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుణదల ఈఎస్‌ఐ ఆస్పత్రిని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలన్నారు. సీపీఎం పశ్చిమ కృష్ణా కార్యదర్శి డివై కృష్ణ మాట్లాడుతూ ఈఎస్‌ఐ కుంభకోణంలో దోషులను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎన్‌సీహెచ్‌ శ్రీనివాస్, బి.నాగేశ్వరరావు, బి.రమణ, బి.సత్యబాబు, సుధాకర్, కాజ సరోజ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు