కనీస వేతనం 18వేలు చేస్తాం

29 Mar, 2019 04:00 IST|Sakshi
మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఏచూరి, కారత్‌

సీపీఎం ఎన్నికల మేనిఫెస్టో విడుదల

న్యూఢిల్లీ: కనీస వేతనం నెలకు రూ.18 వేలు ఉండేలా చట్టం, పౌరులపై ప్రభుత్వ సంస్థల నిఘా ఎత్తివేత, టెలికం సంస్థలు, ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట. ఇవీ సీపీఎం మేనిఫెస్టోలో ప్రధానాంశాలు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు గాను గురువారం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పౌరుల గోప్యతా హక్కుకు భంగం కలిగించేలా ఉన్న ఐటీ చట్టంలోని 69వ సెక్షన్‌ను తొలగిస్తుందని ఏచూరి తెలిపారు. ‘పౌరుల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా/ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పడకుండా నివారిస్తాం.

ఆధార్, బయో మెట్రిక్‌ సమాచారాన్ని సంక్షేమ పథకాలకు వినియోగించుకోవటాన్ని నిలిపివేస్తాం. రైతులు తమ ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు విక్రయించుకునేలా హక్కు కల్పిస్తాం’ అని తెలిపారు. కొన్ని టెలికం సంస్థల గుత్తాధిపత్య ధోరణిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నెలకు రూ.18 వేలకు తక్కువ కాకుండా వేతనం ఉండేలా చట్టం చేస్తామని తెలిపారు. ప్రజా పంపిణీ విధానం ద్వారా కుటుంబానికి నెలకు 35 కేజీల ఆహార ధాన్యాలు అందించటంతోపాటు వృద్ధాప్య పింఛను రూ.6 వేలకు పెంచుతామన్నారు. ఎలక్టోరల్‌ బాండ్లకు బదులు అభ్యర్థుల ఎన్నికల ఖర్చును ప్రభుత్వమే భరించేలా చట్టం చేస్తామన్నారు.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు