ఒక్క సీటూ రాలేదు.. ఉన్న ఓట్లూ దక్కలేదు!

16 Dec, 2018 02:33 IST|Sakshi

సంప్రదాయ ఓట్లూ చెదిరిపోవడంపై  సీపీఎంలో అంతర్మథనం

సాక్షి, హైదరాబాద్‌ : తాజా అసెంబ్లీ ఎన్నికలు సీపీఎంను అంతర్మథనంలోకి నెట్టేసింది. తమ పార్టీకి సంప్రదాయకంగా పడే ఓట్లూ రాకపోగా, ఉన్న కాస్త ఓట్లు కూడా చెదిరిపోవడంతో ఇప్పుడా పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీగా గత ఎన్నికల్లో  ఓటర్లు వ్యతిరేకించినప్పటి స్థితి కంటే ఈ ఎన్నికల్లో తాము దిగజారిపోవడంతో ఆ పార్టీ నేతలు కలవర పడుతున్నారు. రాష్ట్ర రాజకీయ వాతావరణంలో వచ్చిన మార్పు,చేర్పుల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందా ? లేక కిందిస్థాయిలో  సంస్థాగతంగా పార్టీ బలహీనపడిందా అన్న సందేహాలు వారిలో వ్యక్తమవున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గాల్లోనూ ఓటింగ్‌  చెదిరిపోవడం, ఆశించిన మేర సీట్లు రాకపోయినా ఓటింగ్‌ పెంచుకుంటామన్న అంచనా కుదేలవ్వడంతో పార్టీ నాయకుల్లో నిరాశా, నిస్పృహలు అలుముకున్నాయి. ఒక్క సీటయినా గెలవకపోగా, అధికశాతం నియోజకవర్గాల్లో సీపీఎం–బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులకు నామమాత్రం ఓట్లు పోలు కావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. 

కిందివాళ్లు రాలేదు..పై వాళ్లు దూరమయ్యారు...! 
రాష్ట్రంలో 90 శాతానికి పైగా ఉన్న బహుజనులకు (ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీలు, మహిళలు) ప్రాధాన్యం పెంచేందుకు,  సామాజిక న్యాయం చేకూర్చేందుకు  ఎజెండాను ముందుకు తీసుకెళ్లినా ఈ వర్గాల నుంచే తగిన సహకారం అందలేదని సీపీఎం– బీఎల్‌ఎఫ్‌ నేతలు వాపోతున్నారు. రాష్ట్రంలో తాము చేసిన కొత్త ప్రయోగానికి కిందిస్థాయిలోని ఆయా వర్గాలు కలిసి రాకపోగా, ఈ ఎజెండా కారణంగా ఇప్పటివరకు  మద్దతుగా ఉన్న పై కులాలు, వర్గాలు కూడా పార్టీకి దూరమయ్యాయని అంచనా వేస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌– విపక్ష కాంగ్రెస్‌ కూటమి మధ్యలోనే ప్రధాన పోటీ ఉండడంతో  ఓటర్లు తమను పట్టించుకోలేదని సీపీఎం నాయకులు విశ్లేషిస్తున్నారు. అసలు ఈ ఎజెండాను ఎవరి కోసం చేపట్టామో దానిని కిందిస్థాయి వరకు తీసుకెళ్లి ప్రజలకు బలంగా వివరించడంలో  తమ వైఫల్యం ఉందని వారు అంగీకరిస్తున్నారు.

కలసి రాని తమ్మినేని పాదయాత్ర
వాస్తవానికి 2019 ఎన్నికలపై ఎలాంటి ముందస్తు అంచనాలు లేకుండా 2016–2017 మధ్యలో దాదాపు ఆరునెలల పాటు పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రవ్యాప్త పాదయాత్ర కూడా ఇప్పుడు సీపీఎంకు ఆశించిన ఫలితాలు చేకూర్చక పోవడం వారిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ పాదయాత్ర అనంతరం ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు–సామాజికన్యాయం సాధనకు ‘లాల్‌–నీల్‌’ (కమ్యూనిస్టులు, బహుజనులు) పేరిట చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలివ్వడంతో ఎన్నికలకు ముందు ‘ సీపీఎం– బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌’ (బీఎల్‌ఎఫ్‌) ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా  వివిధ వామపక్షాలు, కుల, సామాజిక సంఘాలు, సంస్థలను బీఎల్‌ఎఫ్‌లోకి తెచ్చే ప్రయత్నాలు విఫలమయ్యాయి.దీంతో పార్టీ లక్ష్యాలకు అనుగుణంగా విస్తృత  వేదిక ఏర్పాటు సాధ్యం కాలేదు. మరో వైపు బీఎల్‌ఎఫ్‌పై  సీపీఎం ముద్ర బలంగా ఉన్న కారణంగానే సీపీఐ, ఇతర కమ్యూనిస్టుపార్టీలు, సామాజికసంస్థలు కలసి రాలేదనే అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తంచేస్తున్నారు.ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 26 సీట్లలో పోటీచేసిన సీపీఎంకు మొత్తం 88,733 ఓట్లు (0.4 శాతం), 81 స్థానాల్లో  బరిలో నిలచిన బీఎల్‌ఎఫ్‌కు 1,41,119 ఓట్లు (0.7శాతం) మాత్రమే వచ్చాయి.  

మరిన్ని వార్తలు