మహాకూటమిపై ఏచూరి కీలక వ్యాఖ్యలు

8 Oct, 2018 18:48 IST|Sakshi

ఎన్నికలకు ముందు మహా ఘట్‌బంధన్‌ సాధ్యం కాదు

టీఆర్‌ఎస్‌, బీజేపీల ఓటమే లక్ష్యంగా పనిచేస్తాం

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో ఎన్నికలకు ముందు మహా ఘట్‌బంధన్ (మహా కూటమి) సాధ్యం కాదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై చర్చ జరిగిందని సోమవారం ఆయన మీడియాతో వెల్లడించారు. తెలంగాణలో టీఆర్ఎస్ , బీజేపీ ఓటమి లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ‘మా స్థానాల్లో మేము పోటీ చేస్తాం, మిగిలిన స్థానాల్లో బీజేపీ ఓటమికి పని చేస్తాం’ అని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీ చేస్తామనీ, కాంగ్రెస్‌తో జతకట్టేది లేదని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.(మహాకూటమిపై ‘మాయ’ మబ్బులు)

రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ లలో కొన్ని సీట్లలో పోటీ చేస్తామనీ, మిగిలిన చోట్ల బీజేపీని ఓడించే పార్టీలకు ఓటేయాలని ప్రజలని కోరతామని సీతారం అన్నారు. మహాకూటమి సఫలం కానిపక్షంలో కాంగ్రెస్‌తో పొత్తు అంశం మున్ముందు చెప్తామని పేర్కొన్నారు. బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ పేరుతో ఎన్నికల బరిలోకి దిగుతామన్నారు. బహుజన అజెండా మా లక్ష్యమని ఆయన వెల్లడించారు. ‘సీపీఎం, సీపీఐ అజెండా వేరు. అందుకే మేము రెండు పార్టీ లుగా ఉన్నాం’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన అన్నారు.

చట్టం తీసుకురండి..
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలందరికీ అనుమతినిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పు పట్ల కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ఆయన విమర్శించారు. ఆ పార్టీ జాతీయ స్థాయిలో స్వాగతం పలుకుతూ.. కేరళలో ధర్నాలు నిర్వహిస్తోందని మండిపడ్డారు. శబరిమల తీర్పును వ్యతిరేకిస్తున్న బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో చట్టం తేవాలని అన్నారు.

మరిన్ని వార్తలు