వైఎస్‌ జగన్‌ ఛాంబర్‌లోకి నీళ్లు ఎలా వచ్చాయి?

2 May, 2018 14:08 IST|Sakshi
జగన్‌ కార్యాలయం వద్ద నీటిని శుభ్రం చేస్తున్న సిబ్బంది (నిన్నటి ఫొటో)

ఛాంబర్‌లో సీఆర్‌డీఎ అధికారుల తనిఖీలు

సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఛాంబర్‌లోకి నీరు లీకేజీ ఘటనపై సీఆర్‌డీఎ అధికారులు బుధవారం తనిఖీలు జరిపారు. మంగళవారం కురిసిన చిన్నపాటి వర్షానికే వైఎస్‌ జగన్‌ చాంబర్‌లోకి వర్షపు నీళ్లు లీకైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ ఛాంబర్‌లోకి నీళ్లు ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు అధికారులు పరిశీలన జరిపారు. లీకేజీ ఎక్కడి నుంచి జరిగిందన్న విషయంపై అసెంబ్లీ సిబ్బందిని, పారిశుద్ధ్య కార్మికులను ప్రశ్నించారు. ఛాంబర్‌లోకి నీళ్లు ఎలా వచ్చాయంటూ రూఫ్ పైన ఫైర్‌ ఇంజిన్‌తో నీటిని పంప్ చేసి పరిశీలించారు. సీలింగ్ లో ఏర్పడిన లోపం కారణంగానే నీరు లీకైనట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు.

మంగళవారంనాడు కురిసిన వర్షంతో చాంబర్‌ సీలింగ్‌ నుంచి వర్షపు నీరు ధారగా కారడంతో.. ఆ అంశంపై శాసనసభ ఇన్‌చార్జి కార్యదర్శి ఎం.విజయరాజుకు వైఎస్సార్‌ సీఎల్పీ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఇన్‌చార్జి కార్యదర్శి ఆదేశాల మేరకు శాసనసభ సిబ్బంది వర్షపు నీటిని ఎత్తిపోశారు. గతేడాది జూన్‌లో కురిసిన వర్షానికి కూడా ఇదే రీతిలో ప్రతిపక్ష నేత చాంబర్‌లో వర్షపు నీరు పైనుంచి లీకై చేరింది.  ఆ ఘటనపై అప్పట్లో రాద్ధాంతం చేసిన అధికార పార్టీ తూతు మంత్రపు విచారణ జరిపించింది. పైగా నీరు లీకేజీకి సంబంధించి కుట్ర ఉందని అధికార పార్టీ హైడ్రామాకు తెరలేపింది. అప్పట్లో పైపై రిపేర్లు చేసి నట్టు ప్రకటించారు. మంగళవారం కురిసిన అకాల వర్షానికి ప్రతిపక్ష నేత చాంబర్‌లోకి మరోసారి నీరు లీకవడం గమనార్హం.

మరిన్ని వార్తలు