గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్

29 May, 2019 12:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చరిత్రలోనే అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది కాంగ్రెస్ పార్టీ. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో రాహుల్‌గాంధీ రాజీనామాపై హైడ్రామా కొనసాగుతుండగా... మరోపక్క మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. మధ్యప్రదేశ్‌, కర్ణాటకతోపాటు రాజస్థాన్‌లోనూ అధికారాన్ని ఒడిసిపట్టేందుకు బీజేపీ బలంగా పావులు కదుపుతోంది. కమలదళం పట్టుబిగుస్తుండడంతో కాంగ్రెస్‌ ఊపిరాడక విలవిల్లాడుతోంది.

లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాభవంతో కాంగ్రెస్ కుదేలైంది. మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయే పరిస్థితి నెలకొంది. గతేడాది డిసెంబర్‌లో కష్టపడి గట్టెక్కిన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌తోపాటు కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాల పరిస్థితి దినదిన గండంగా మారింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవడం కమల్‌నాథ్ సర్కారుని ఇబ్బందుల్లోకి నెట్టింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనార్టీలో ఉందని.. అసెంబ్లీ సెషన్ ఏర్పాటుచేసి బలనిరూపణ చేసుకునేలా కమల్‌నాథ్‌కు ఆదేశాలివ్వాలంటూ ఏప్రిల్‌ 20న బీజేపీ గవర్నర్‌కు లేఖ రాసింది. దీంతో ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. ఎమ్మెల్యేలు బీజేపీ వలలో పడకుండా... ఒక్కో మంత్రి ఐదుగురు శాసనసభ్యులపై ఫోకస్‌ పెట్టాలని ఆయన సూచించారని సమాచారం. ఆయా ఎమ్మెల్యేల నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యతను కూడా 27 మంది మంత్రులదేనని సీఎం స్పష్టంచేసినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 నియోజకవర్గాలుండగా, 2018 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ 114 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 109 స్థానాల్లో విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్‌ 116కు రెండు స్థానాలు తక్కువ కావడంతో... ఎస్పీ నుంచి ఒకరు, బీఎస్పీ నుంచి ఇద్దరు, నలుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల మద్దతుతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం కొలువుదీరింది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 29 స్థానాల్లో బీజేపీ 28 స్థానాల్లో విజయం సాధించడంతో.. ప్రభుత్వానికి కష్టాలొచ్చిపడ్డాయి.

అటు రాజస్థాన్‌లోనూ పరిస్థితి ఇంతే ఆందోళనకరంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేయడంతో.. కాంగ్రెస్ కంగుతింది. వర్కింగ్ కమిటీ సమావేశంలో సీఎం అశోక్ గెహ్లాట్‌పై పార్టీ చీఫ్‌ రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారన్న వార్తలతో పరిస్థితి మరింత దిగజారింది. గెహ్లాట్‌ అనుంగు నేత లాల్‌ చంద్‌ కటారియా మంత్రి పదవికి రాజీనామాచేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గెహ్లాట్‌ ప్రభుత్వంపై అసంతృప్తితో మరో 25మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో పరిస్థితిని సమీక్షించేందుకు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము కూల్చక్కరలేదని.. అంతర్గత కల్లోలంతో అతిత్వరలోనే అదే కూలిపోతుందని బీజేపీ నేత భవాని సింగ్ రాజ్వత్‌ అంటున్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇటు కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వానిది మరింత దారుణ పరిస్థితి. ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని బీజేపీ రాష్ట్ర చీఫ్‌ యడ్యూరప్ప బహిరంగ సవాళ్లు చేస్తుండడంతో..  అధికారం ఎలా నిలబెట్టుకోవాలో అర్థంకాక కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతలు తలపట్టుకుంటున్నారు. రెబల్స్‌ని బుజ్జగించేందుకు కెబినెట్‌ విస్తరణ చేపట్టాలనుకున్నా, ఎవరిని తొలగిస్తే ఏమవుతుందోనన్న భయంతో ముఖ్యమంత్రి కుమారస్వామి కంటిమీద కునుకేయడంలేదు. సంక్షోభం ముదరడంతో కాంగ్రెస్ అధికార ప్రతినిధులు కేసీ వేణుగోపాల్, అహ్మద్‌పటేల్‌ బెంగళూరు వెళ్లారు. తాజాగా మధ్యంతర ఎన్నికలకు వెళ్దమని కొత్త సవాల్ చేశారు యడ్యూరప్ప. గుజరాత్‌లోనూ 20మందికిపైగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే అల్పేష్ ఠాకూర్‌ ప్రకటించారు. గత అసెంబ్లీలో గుజరాత్‌లో బీజేపీకి గట్టిపోటీ ఇచ్చిన కాంగ్రెస్‌.. లోక్‌సభ ఎన్నికల్లో అస్సలు ప్రభావం చూపలేకపోయింది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, కర్ణాటకను కోల్పోతే ఇక కాంగ్రెస్‌కి మిగిలేది ఒక్క ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రమే. అలకలు, ఆగ్రహాలు పక్కపెట్టి సంస్థాగత బలోపేతంపై దృష్టిపెట్టకపోతే.. కాంగ్రెస్‌ విముక్తభారత్‌ సాధనలో బీజేపీ విజయం సాధించినా ఆశ్చర్యం లేదంటున్నారు రాజకీయ పండితులు.

మరిన్ని వార్తలు