హిందూ దేవుళ్లను మద్యంతో పోల్చినా..

17 Mar, 2018 19:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సమాజ్వాది పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు నరేశ్ అగర్వాల్ను ఇటీవల భారతీయ జనతాపార్టీ చేర్చుకోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విస్కీలో విష్ణువు ఉన్నారు, రమ్లో శ్రీరామ్ ఉన్నారంటూ హిందూ దేవుళ్లను మద్యం బ్రాండ్లతో పోల్చడం, భారత సైన్యం సత్తాను ప్రశ్నించడం, పాక్లో ఉరి శిక్ష పడిన కులభూషణ్ జాదవ్ను టెర్రరిస్టుగా వర్ణించడం, సమాజ్వాది పార్టీ ఎంపీ జయా బచ్చన్పై సెక్స్ కామెంట్లు చేయడం, ప్రధాని నరేంద్ర మోదీకి కులతత్వాన్ని ఆపాదించడం ద్వారా నరేశ్ అగర్వాల్ అత్యంత వివాదాస్పదుడయ్యారు.

గోమాంసం, ట్రిపుల్ తలాక్ పట్ల బీజేపీ వైఖరిని తీవ్రంగా విమర్శించిన ఆయన ఓ గ్యాంగ్ రేప్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్ల రద్దు తాము తీసుకున్న అత్యంత దరిద్రమైన నిర్ణయమని ఏనాడైనా బీజేపీ ఒప్పుకుంటుందా? అని కూడా ఆయన ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకోవడానికి బీజేపీ ఏమైనా వాషింగ్ మిషనా!, బీజేపీ భిన్నమైన పార్టీ అంటే అర్థం ఇదేనా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జీవితంలో తానెన్నడూ బీజేపీలో చేరనంటూ కూడా శపథం చేశారు. ఆయన ద్వంద్వ ప్రమాణాలు,  వివాదాస్పద వ్యాఖ్యలను తెలుసుకోవాలంటే ‘ది లల్లాన్టాప్ డాట్ కామ్’కు 2017, ఫిబ్రవరి 13వ తేదీన ఇచ్చిన ఇంటర్వ్యూను చూడాల్సిందే.

మరిన్ని వార్తలు