ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌దే హవా..!!

25 May, 2018 20:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్కంఠగా సాగిన కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. దీనినే పెద్ద వైఫల్యంగా భావించిన బీజేపీకి సర్వే సంస్థ సీఎస్‌డీఎస్‌- లోక్‌నీతి నివేదిక మరో షాక్‌ ఇచ్చింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్‌ పార్టీకే అధికారం చేజిక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని లోక్‌నీతి సర్వేలో పేర్కొంది. ‘మూడ్‌ ఆఫ్‌ నేషన్‌’  పేరిట ఏప్రిల్‌ 20 నుంచి మే 17 వరకు.. 19 రాష్ట్రాల్లో సుమారు 15 వేల మంది అభిప్రాయాలను సేకరించిన లోక్‌నీతి.. రాజస్థాన్‌లో 5 శాతం, మధ్యప్రదేశ్‌లో 15 శాతం ఎక్కువ పాయింట్లతో బీజేపీ కన్నా కాంగ్రెస్‌ పార్టీ ముందుందని సర్వేలో పేర్కొంది.

దళితులు, మైనార్టీలు బీజేపీకి వ్యతిరేకం...
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మరో అవకాశం ఇవ్వడానికి దళితులు, మైనార్టీలు సిద్ధంగా లేరని సర్వే చెబుతోంది. అయితే అదే సమయంలో హిందూమతంలోని అగ్రవర్ణాలు, ఓబీసీలు మోదీకి మరో అవకాశం ఇవ్వడానికి సానుకూలంగానే ఉన్నారంటూ పేర్కొంది.

రాహుల్‌ గాంధీకి పెరుగుతున్న ప్రజాదరణ..
చరిష్మా కలిగిన నేతగా వెలుగొందుతున్న నరేంద్ర మోదీ అభిమానుల్లో 25 శాతం మంది ప్రస్తుతం ఆయనను తమ అభిమాన నాయకునిగా భావించడం లేదని లోక్‌నీతి సర్వే పేర్కొంది. అదే సమయంలో రాహుల్‌ గాంధీకి ప్రజాదరణ పెరుగుతోందని.. ప్రస్తుతం మోదీకి సమాన స్థాయిలో (43%) అభిమానులను రాహుల్‌ కలిగి ఉన్నారని లోక్‌నీతి సర్వేలో వెల్లడించింది. అయితే రాహుల్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ అంత సులభంగా అధికారంలోకి రాలేదని.. అందుకోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది

>
మరిన్ని వార్తలు