‘మోదీకి కుటుంబం లేకనే ఎక్కడికీ వెళ్లట్లేదు’

10 May, 2019 16:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న తరణంలో నేతల మాటలు తూటల్లా పేలుతున్నాయి. రాజకీయ విమర్శలు దాటి వ్యక్తిగత విమర్శల వరకు హద్దులు మీరుతున్నాయి. 1987లో ఐఎన్‌ఎస్‌ విరాట్‌ యుద్ధ నౌకను రాజీవ్‌ గాంధీ దంపతులు తమ వ్యక్తిగత విహార యాత్ర కోసం ఉపయోగించుకున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలు కాంగ్రెస్‌ శ్రేణులను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ ఘాటైన వ్యాఖ్యలతో స్పందించారు. ‘ ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కుటుంబంతో విహార యాత్రలకు వెళ్లడం సర్వసాధారణం. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ కూడా  ఆయన భార్య సోనియా గాంధీతో కలిసి వెళ్లారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకి కుటుంబం (భార్య) లేదు కాబట్టి ఎక్కడికీ వెళ్లడంలేదు. కేవలం ఆయనొక్కరే ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారు.’’ అంటూ వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు.

కాగా ప్రధాని చేసన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజీవ్‌ గాంధీ ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని స్పష్టం చేస్తున్నారు. నాడు రాజీవ్‌ కోసం ప్రత్యేకంగా విరాట్‌ను తీసుకెళ్లడంగానీ, దాని రూట్‌ మార్చడంగానీ చేయలేదని నావికాదళం ప్రధానాధికారిగా రిటైరైన అడ్మిరల్‌ రాందాస్‌ మీడియా ముఖంగా మోదీకి వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. విరాట్‌ నౌక లక్ష దీవులకు వెళుతుందని తెలిసి రాజీవ్‌ దంపతులు నౌక ఎక్కారని, వారికి తానే అతిథ్యం ఇచ్చానని కూడా ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు