లోకేశ్‌ పర్యటనలో అపశ్రుతి

7 Apr, 2019 12:14 IST|Sakshi
ఇంటివద్దే నాటువైద్యం చేయించుకుంటున్న బాలుడు

బాలుడికి విద్యుదాఘాతం

ప్రచారరథం పైనుంచి కిందకు దిగని వైనం

ఆత్మకూరులో బీసీలపై సీబీఎన్‌ ఆర్మీ దాడి

ప్రాణాలు పోయినా ఇంతేనా.. 

అని మధనపడుతున్న టీడీపీ నేతలు

తాడేపల్లిరూరల్‌(మంగళగిరి): ‘ఎల్లప్పుడూ మీ వెంటే’ అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొడుతున్న నారా లోకేశ్‌ మాటలు నీటిమీద రాతల్లా మారాయని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  వివరాల్లోకి వెళితే..మంత్రి నారా లోకేశ్‌ దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో పర్యటిస్తుండగా, అదే గ్రామంలో నివాసం ఉండే సయ్యద్‌ మస్తాన్, రేష్మా దంపతుల పెద్ద కొడుకైన జహీర్‌బాషాకు టీడీపీ నాయకులు ఐరన్‌ పైప్‌ తొడిగి ఉన్న  జెండా ఇచ్చి, అది పట్టుకుని వారి కాన్వాయ్‌ వెంటే రావాలని సూచించారు.

ఆ బాలుడు ఆ జెండా పైప్‌ తీసుకుని లోకేశ్‌ పర్యటన వెంట వెళ్తుండగా, విద్యుత్‌ స్తంభంపై ఉన్న కరెంటు తీగలకు జెండా రాడ్‌  తగిలింది. దాంతో కరెంటు షాక్‌ కొట్టి ఆ బాలుడు కిందపడి గిలగిలా కొట్టుకున్నాడు. అయినప్పటికీ నారా లోకేశ్‌ కిందపడిన ఆ బాలుడిని చూసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు తప్ప, కనీసం కిందకు దిగి ఏం జరిగిందని కూడా తెలుసుకోలేదు.

అలాగే శుక్రవారం రాత్రి గౌడ సంఘం నాయకులు తమ వీధిలోకి ఎందుకు రాలేదని ప్రశ్నించడంతో వారిపై అక్కడ ఉన్న  నారా లోకేశ్‌ సామాజిక వర్గానికి చెందిన సీబీఎన్‌ సేన దాడికి పాల్పడింది. లోకేశ్‌ కనీసం వారిని వారించలేదు. ఓ మైనార్టీ కుటుంబంలోని బాలుడికి కరెంటు షాక్‌ కొడితే పట్టించుకోలేదని, గౌడ వర్గీయులపై విచక్షణారహితంగా దాడి చేసినా పట్టించుకోకపోవడం ఏమిటంటూ అక్కడి వారు ప్రశ్నించారు. ప్రాణాలు పోయినా అంతేనా అంటూ టీడీపీ నేతలే లోకేశ్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.

మరిన్ని వార్తలు