ఓటమి భయంతోనే దాడులు

13 Apr, 2019 04:34 IST|Sakshi
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు

చంద్రబాబు, లోకేశ్‌ రాష్ట్రాన్ని దోచుకున్న ఘోరీ, ఘజనీలు

లోకేశ్‌ తోడల్లుడు శ్రీభరత్‌ను ఓడించాలంటూ టీడీపీ నేతల ఫోన్లు

వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు

సాక్షి, విశాఖపట్నం: ఓటమి భయంతో ప్రణాళిక ప్రకారమే పోలింగ్‌ కేంద్రాల్లో దాడులు చేయడం, ఈవీఎంల మొరాయింపు వంటి దుష్ట రాజకీయాలకు చంద్రబాబు పాల్పడ్డారని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. మంత్రి లోకేశ్‌ తోడల్లుడు, విశాఖ లోక్‌సభ టీడీపీ అభ్యర్థి శ్రీభరత్‌కు పడే ఓట్లను జనసేన ఎంపీ అభ్యర్థికి మళ్లించాలంటూ పోలింగ్‌ రోజున ఆ పార్టీ నేతలు చేసిన ఫోన్ల రాజకీయం బట్టబయలైందని అన్నారు. అనకాపల్లి జనసేన అభ్యర్థి పోలింగ్‌ చివరిలో టీడీపీకి ఓట్లు వేయాలని చెప్పడం చూస్తే ఆ రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలు ఏ స్థాయిలో సాగాయో అర్థమవుతోందన్నారు.

స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి తలుపులు వేసుకోవడం, చొక్కా చించుకుని వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు తనపై దాడి చేశారని చెప్పడం నీచ రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. చంద్రబాబుకు సీఎం పదవిపై ఉన్న వ్యామోహం ఎన్నికల సందర్భంగా మరోసారి బట్టబయలైందని, తండ్రీకొడుకులిద్దరూ రాష్ట్రాన్ని దోచుకునే ఘోరీ, ఘజనీలాంటి వాళ్లని దుయ్యబట్టారు. ఆ స్వార్థంతోనే ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనుగోలు చేయటం, నిరసనలకు దిగటం వంటి కుట్రలకు తెగబడ్డారని ధ్వజమెత్తారు.

కలెక్టర్లు చంద్రబాబు ఏజెంట్లు
విశాఖ జిల్లాలో 30 ఈవీఎంలు మొరాయించినా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో కలెక్టర్‌ విఫలమయ్యారన్నారు. జిల్లా కలెక్టర్లు చంద్రబాబు ఏజెంట్లుగా పనిచేశారని ఆరోపించారు. అదనపు ఈవీఎంలు సిద్ధం చేయకపోవడం వల్లే కొన్నిచోట్ల పోలింగ్‌ శాతం తగ్గిందన్నారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. విశాఖ జిల్లాలో వైఎస్సార్‌ సీపీకి 11 నుంచి 12 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని బదులిచ్చారు.

తోక మీడియాలో పదేపదే ప్రచారం
తన అనుచరులతో దాడులు చేయించిన చంద్రబాబు.. తోక మీడియాలో మాత్రం వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు దాడులు చేసినట్టుగా పదేపదే ప్రసారం చేయించారని వీరభద్రరావు ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రలో మంత్రులు అచ్చెన్నాయుడు, గంటా, అయ్యన్న అరాచకాలకు, రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మంత్రి గంటా అనుచరులు అపార్ట్‌మెంట్‌లలోని ఓటర్లకు రిఫ్రిజరేటర్లు, ఏసీల వంటి తాయిలాలతో ప్రలోభపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు వికటించాయన్నారు. గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు చివరి నిమిషంలో జనసేనతో కలిసిపోయారన్నారు.

మరిన్ని వార్తలు