‘బాబు ఓటమిని ఎవరిపై నెట్టాలా? అని చూస్తున్నారు’

15 Apr, 2019 13:54 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ నేత దాడి వీరభద్రరావు

సాక్షి, విశాఖపట్నం : చంద్రబాబు తన హోదాను మరిచిపోయి ప్రవర్తిస్తున్నారని, తన ఓటమిని ఎవరిపై నెట్టాలా? అని చూస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత దాడి వీరభద్రరావు అన్నారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసినా.. అంగీకరించక  చంద్రబాబు మరోచోట ప్రమాణం చేసేటట్లున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ గ్రిడ్స్‌ ద్వారా డేటా చోరి జరిగిందన్న అంశం నిర్ధారణకు వచ్చిందని, దేశభద్రతకు నష్టం కలిగించేలా డేటా చోరీ జరిగిందన్నారు. ఇందులో టీడీపీ నేత ప్రమేయాన్ని బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఐటీ గ్రిడ్స్‌-టీడీపీ మధ్య వ్యవహారంపై విచారణ జరిపించాలన్నారు. ఆధార్‌ సంస్థ ఇప్పుడు అన్ని అంశాలు వెల్లడించిందని, ఐటీ మంత్రి లోకేష్‌ డేటా చోరికి పాల్పడ్డారని, తండ్రీకొడుకులు ఇద్దరు దేశద్రోహానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు.

ఎన్నికల సంఘం వంటి రాజ్యంగ సంస్థను అప్రతిష్టపాలు చేయడం వల్ల చంద్రబాబుకు ఒరిగేదేం లేదన్నారు. ఈవీఎంల విషయంలో  ప్రజలను అయోమయానికి గురిచేసేలా మాట్లాడుతున్న చంద్రబాబు.. ఇవే ఈవీఎంలతో 2014లో గెలవలేదా? అప్పుడు చంద్రబాబు ట్యాంపరింగ్‌ చేశారా? అని ప్రశ్నించారు. 2018లో రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి.. కాంగ్రెస్‌ గెలిచిందని, మరి అక్కడ ట్యాంపరింగ్‌ ఎవరు చేశారన్నారు. నిరాదారమైన ఆరోపణలు చేస్తూ చంద్రబాబు.. ఓటమికి సాకులు ఎత్తుకుంటున్నారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు