‘మండలిని రద్దు చేసే అధికారం రాజ్యాంగంలో ఉంది’

21 Jan, 2020 18:12 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : శాసనమండలిని రద్దు చేసే అధికారం రాజ్యాంగంలో ఉందని వైఎస్సార్‌సీపీ నేత దాడి వీరభద్రరావు తెలిపారు. శాసన మండలిలో టీడీపీ అనవసరంగా రాద్ధాంతం సృష్టిస్తోందని మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోమవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం అద్భుతంగా ఉందన్నారు. ఆ ప్రసంగం చూడని వ్యక్తులు.. ఒక్కసారైనా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మూడు ప్రాంతాలకు అభివృద్దిని వికేంద్రీకరణ చేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ చారిత్రత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. శాసనసభలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ బిల్లును మండలిలో అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. 

మండలి చైర్మన్‌కు ఒక బిల్లును అడ్మిట్‌ చేయాలా, వద్దా అనే అధికారం లేదన్నారు. ఏ బిల్లునైనా యథాతథంగా ప్రవేశపెట్టాలని చెప్పారు. మండలిలో చర్చ జరిగిన తర్వాత దానిని మద్దతు తెలుపాలా వద్దా అన్న అంశాన్ని సభ్యులు నిర్ణయిస్తారని చెప్పారు. టీడీపీకి మెజారిటీ ఉంటే మండలిలో సవరణలు కోరవచ్చన్నారు. కౌన్సిల్‌లో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని.. ఇది సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఈ ప్రతిష్టంభన వెనక టీడీపీ ఉద్దేశమేమిటని చంద్రబాబును ప్రశ్నించారు. రాజ్యాంగ ప్రతిష్టంభన తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నేత బాధ్యతను కూడా చంద్రబాబు నెరవేర్చలేకపోతున్నారని విమర్శించారు. టీడీపీని ఉప ప్రాంతీయ పార్టీగా మారుస్తున్నారని అన్నారు. చంద్రబాబు 29 గ్రామాలకే పరిమితం అవుతారా అని నిలదీశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు అవసరం చంద్రబాబుకు లేదా అని ప్రశ్నించారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అమరావతి ఉంటే చాలు ఇతర ప్రాంతాలు వద్దంటున్నారని.. ఈ విషయాన్ని జనసేన కార్యకర్తలు గుర్తించాలని కోరారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ రాజకీయాలు తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు.

చదవండి : మండలిలో గందరగోళం సృష్టిస్తోన్న టీడీపీ

మరిన్ని వార్తలు