పతనం మొదలు!

15 Sep, 2018 11:42 IST|Sakshi

కుటుంబ పాలనపై రగిలిపోతున్న ద్వితీయ శ్రేణి నాయకులు

పార్టీని వీడనున్న వేపకుంట రాజన్న, రాప్తాడు ఎంపీపీ దగ్గుబాటి ప్రసాద్‌

సునీత సామాజిక వర్గానికి చెందిన నేతల్లోనే తీవ్ర అసంతృప్తి

మండలానికో ఇన్‌చార్జ్‌గా మంత్రి సునీత కుటుంబీకులు

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో వీరిదే నిర్ణయం

‘పరిటాల కోట’కు బీటలు వారుతున్నాయా? మంత్రి సునీత సామాజిక వర్గానికి చెందిన నేతలే ఆ కుటుంబం తీరుతో విసిగిపోతున్నారా? టీడీపీనీ వీడి ప్రత్యామ్నాయ అన్వేషణలో ఉన్నారా? నియోజకవర్గంలో టీడీపీ పతనావస్థకు చేరిందా? తాజా పరిణామాలు చూస్తుంటే ఔననే సమాధానం వస్తోంది. రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తోన్న వేపకుంట రాజన్న, రాప్తాడు ఎంపీపీ దగ్గుబాటి ప్రసాద్‌లు టీడీపీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీరు పార్టీని వీడేందుకు ఉత్పన్నమైన పరిణామాలు, నియోజకవర్గంలో పరిటాల కుటుంబ తీరుతెన్నులు.. పార్టీ స్థితిగతులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాప్తాడు నియోజకవర్గం నుంచి మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రభుత్వంలో భాగస్వామిగా, బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న సునీత సొంత నియోజకవర్గంలోనే పాలన పూర్తిగా గాడి తప్పింది. తహసీల్దార్లు, ఎంపీడీఓలతో పాటు ప్రజలచేత ఎన్నికైన ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులకు ఈ నియోజకవర్గంలో ఎలాంటి నిర్ణయాధికారాలు లేవు. ఏ మండలంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా, సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నా ‘పరిటాల ఫ్యామిలీ’ నిర్ణయమే ఫైనల్‌. ఇందుకోసం సునీత తమ రక్త సంబంధీకులు, ఆత్మీయులనే ఇన్‌చా ర్జీలుగా నియమించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సంగతి పక్కనపెడితే మండలాల వారీగా భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు, కాంట్రాక్టులతో పాటు ఆర్థిక లబ్ధి పొందే అంశాల్లో వీరు కీలకశక్తిగా ఎదిగారు. ఈ పరిస్థితి ఆయా మండలాల్లోని ప్రజాప్రతినిధులు, కీలక నేతలకుమింగుడు పడని పరిస్థితి. పరిటాల కుటుంబాన్ని ఎదిరించేందుకు బెదిరి మొదట్లో సర్దుకుపోయారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మంత్రికి నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తున్న తరుణంలో ఒక్కొక్కరుగా ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. చివరకు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. వీరిలో సునీత సామాజికవర్గానికి చెందిన కీలక నేతలే ఉండటం గమనార్హం.

సైకిల్‌ దిగనున్న దగ్గుబాటి ప్రసాద్‌
రాప్తాడు ఎంపీపీ దగ్గుబాటి ప్రసాద్‌ పరిటాల కుటుంబంతో అన్యాయానికి గురైన జాబితాలో చేరారు. వ్యాపారవేత్త అయిన ప్రసాద్‌ ఎంపీపీగా ఎన్నికయ్యేందుకు భారీగా ఖర్చు చేశారు. తర్వాత కూడా పార్టీ కోసం రూ.కోట్లు కుమ్మరించారు. అయితే సునీత సోదరుడు మురళీ నాలుగేళ్లుగా ప్రసాద్‌ను తీవ్ర వేదనుకు గురిచేశారని తెలుస్తోంది. ఎంపీపీగా పూర్తి డమ్మీని చేసి, తానే ఎంపీపీగా వ్యవహరించారు. మురళీ సిఫార్సు లేకుండా ఎంపీపీ చెబితే పింఛన్‌ కూడా ఇవ్వలేని స్థితికి ప్రసాద్‌ చేరారు. దీంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎంపీపీ చేయాల్సిన పనులను మురళీ చేస్తున్నారు. బుక్కచెర్లలో రూ.కోటితో చేసిన సామిరెడ్డిపల్లి వంక అభివృద్ధి పనులకు మురళీ భూమిపూజ చేశారు. బోగినేపల్లి సీసీరోడ్డుకు భూమి పూజ చేశారు. చివరకు గురువారం అయ్యవారిపల్లి సీసీరోడ్డుకు కూడా అతనే భూమిపూజ చేశారు. మురళీ కనీసం వార్డు మెంబర్‌ కూడా కాదు. అయినప్పటికీ అధికారులు ప్రొటోకాల్‌కు విరుద్ధంగా ఆయనతోనే కార్యక్రమాలు చేయిస్తున్నారు. చివరకు రాప్తాడులో నిర్మించిన టీడీపీ ఆఫీసుకు ప్రసాద్‌ రూ.10లక్షలు విరాళం ఇచ్చారు. దీని ప్రారంభోత్సవానికి ఆహ్వానం కూడా పంపలేదు. ఇక శుక్రవారం పండమేరులో మంత్రి నిర్వహించిన జలహారతి కార్యక్రమానికీ ఎంపీపీకి సమాచారం ఇవ్వలేదు. ఇలా ప్రతీ అంశంలో కనీసమర్యాద లేకుండా ప్రసాద్‌ను అవమానానికి గురిచేశారు.

ఆర్థికంగా బలహీనుడి చేసే ప్రయత్నం
ఆర్థికంగా కూడా ప్రసాద్‌ను బలహీనుడిని చేసే ప్రయత్నం చేశారు. నాలుగేళ్లలో ఎలాంటి కాంట్రాక్టు ప్రసాద్‌కు దక్కకుండా మంత్రి ప్రయత్నించారని తెలుస్తోంది. ప్రసాద్‌ సొంత గ్రామం బండమీదపల్లిలో రూ.8.5కోట్లతో చేస్తున్న కాలవ పని ప్రసాద్‌కు దక్కుకుండా మురళీనే ఎన్‌ఎంఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు ఇప్పించుకుని పనిచేస్తున్నారు. ఆర్థికంగా తాను నష్టపోయానని, పని ఇవ్వాలని విన్నవించినా ఖాతరు చేయలేదు. దీంతోపాటు వ్యాపార రీత్యా ప్రసాద్‌ను దెబ్బతీసే యత్నం చేశారు. ప్రసాద్‌కు హైదరాబాద్‌లో ‘డీబీ పాలిమర్స్‌’ అనే పెట్రో కెమిల్‌లైన్స్‌ పైపులు తయారు చేసే పరిశ్రమ ఉంది. ఇందులో మురళీ కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించారు. వారంతా మూడేళ్లు అందులో పూర్తిగా శిక్షణ పొందిన తర్వాత వారిని అక్కడి నుంచి రప్పించి, రూ.20కోట్లతో గతేడాది డిసెంబర్‌లో ‘ఎస్‌వీఆర్‌ఎస్‌ పాలిమర్స్‌’ పేరుతో కొత్త పరిశ్రమను స్థాపించారు. ఈ ఘటనతో ప్రసాద్‌ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. రాజీనామా లేఖను మంత్రి సునీత వద్దకు తీసుకెళ్లి ఇచ్చారు. అయితే ఎన్నికలు ముగిసే వరకూ రాజీనామా చేయొద్దని, పార్టీలోనే ఉండాలని.. వెళితే పార్టీకి వ్యతిరక పవనాలు వీస్తున్నాయనే మెసేజ్‌ ప్రజల్లోకి వెళుతుందని ప్రసాద్‌ను బెదిరించినట్లు తెలుస్తోంది. అయితే బెదిరింపులకు లొంగకుండా పార్టీని వీడేందుకే ప్రసాద్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

వేపకుంట రాజన్నదీ అదేబాట
పరిటాల రవీంద్ర హయాంలో ఆయనకు కుడిభుజంగా వేపకుంట రాజన్న ఎదిగారు. కనగానపల్లి మండలంలో కీలక నేత. సునీత, ఆమె కుటుంసభ్యుల తీరుతో విసిగిపోయిన రాజన్న టీడీపీకి దూరంగా ఉంటున్నారు. త్వరలోనే పార్టీని వీడుతానని సన్నిహితులకు చెబుతున్నారు. కనగానపల్లి ఇన్‌చార్జిగా నెట్టెం వెంకటేశ్‌ మొన్నటి వరకూ కొనసాగారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ నేత ముకుందనాయుడు టీడీపీలోకి వెళ్లారు. నాయుడు భర్త పద్మీగీత ఎంపీపీగా కొనసాగుతున్నారు. నెట్టెం వెంకటేశ్‌ను తప్పించి నాయుడికి కనగానపల్లి బాధ్యతలు అప్పగించారు. దీంతో వెంకటేశ్‌ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు. నాలుగేళ్లుగా పరిటాల కుటుంబం ఆర్థికంగా అత్యంత బలంగా ఎదగడం మినహా ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలకు ఒరిగిందేమీ లేదని.. వీరిని నమ్ముకుంటే రోడ్డునపడక తప్పదనే నిర్ణయంతో పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు