విశాఖ బరిలో పురందేశ్వరి

22 Mar, 2019 13:21 IST|Sakshi

పెదవాల్తేరు(విశాఖ తూర్పు): భారతీయ జనతా పార్టీ తరపున విశాఖపట్నం పార్లమెంట్‌ స్థానానికి దగ్గుబాటి పురందేశ్వరి బరిలో నిలిచారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో విడుదల చేసిన జాబితాలో ఆమె పేరు ప్రకటించారు. గత ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో బరిలో దిగిన కె.హరిబాబు ఎంపీగా గెలవడం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఈ స్థానానికి హరిబాబుతో పాటుగా పురందేశ్వరి, తదితరులు పోటీపడ్డారు. చివరికి బీజేపీ అధిష్టానం పురందేశ్వరి పేరుని ఖరారు చేసింది. ఆమె ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. ఆమె 2009 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా కాంగ్రెస్‌ తరపున గెలిచి మన్మోహన్‌సింగ్‌ మంత్రివర్గంలో కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.

విశాఖ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పేడాడ
డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ): కాంగ్రెస్‌ పార్టీ విశాఖ పార్లమెంట్‌ అభ్యర్థిగా పేడాడ రమణకుమారి పోటీ చేయనున్నారు. పార్టీ అధిష్టానం ఆమె పేరును గురువారం ప్రకటించింది. పేడాడ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. గతంలో మహిళా కాంగ్రెస్‌ నగర అధ్యక్షురాలిగా పార్టీకి సేవలందించిన ఆమె గత సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

మరిన్ని వార్తలు