చంద్రబాబువి నీచ రాజకీయాలు

12 Nov, 2018 12:31 IST|Sakshi
కర్నూలులో విలేకరులతో మాట్లాడుతున్న పురంధేశ్వరి

కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి

నంద్యాలవ్యవసాయం/కర్నూలు సీక్యాంప్‌ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ నాయకురాలు పురంధేశ్వరి ధ్వజమెత్తారు. నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చ, కర్నూలులో విలేకరుల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2014 సాధారణ ఎన్నికల సమయంలో అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్‌ను విడదీసిన కాంగ్రెస్‌ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని చంద్రబాబు పిలుపు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నేడు అదే పార్టీతో పొత్తు పొట్టుకోవడాన్ని ఏమనాలని ప్రశ్నించారు. బీజేపీ సిద్ధాంతాలు గల పార్టీ అని, ఇందులో ప్రతి ఒక్కరికీ గౌరవ మర్యాదలు ఉంటాయన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు హరీష్‌బాబు మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు 600 హామీలు ఇచ్చి 60 కూడా నెరవేర్చలేకపోయారన్నారు.   

అన్ని కులాలకు రిజర్వేషన్‌ ఇస్తామని నమ్మబలికి మోసం చేశారన్నారు. రోజుకోమాట, పూటకో అబ్ధం చెబుతూ ఊసరవెళ్లిలా రంగులు మారుస్తున్నారన్నారు. రాష్ట్ర మహిళా మోక్ష అధ్యక్షురాలు తోట విజయలక్ష్మి మాట్లాడుతూ..భారతదేశాన్ని అవినీతి రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు  నరేంద్రమోదీ కృషి చేస్తున్నారన్నారు. నంద్యాల పట్టణంలోని వ్యాపారవేత్త పోచా లలితారెడ్డి తన అనుచరులతో పురంధేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరారు. రాష్ట్ర కార్యదర్శి ఏరాసు శ్రీనివాసరెడ్డి ,   రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య, జిల్లా మహిళా మోర్చ అధ్యక్షురాలు గీతామాధురి, పోచా బ్రహ్మానందరెడ్డి, మహిళా మోర్చ ఉపాధ్యక్షురాలు షబానా, నంద్యాల బీజేపీ అధ్యక్షుడు పసుపుల రవి, చంద్రశేఖర్, జయలక్ష్మి, ఇంటి ఆదినారాయణ, తూము శివారెడ్డి, డాక్టర్‌ బుడ్డా శ్రీకాంతరెడ్డి, మేడా మురళీకృష్ణ, కశెట్టి చంద్రశేఖర్, కృష్ణమూర్తి, పెసల శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు