చంద్రబాబును చూస్తే జాలేస్తోంది: దగ్గుబాటి

26 Feb, 2019 14:18 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో చంద్రబాబు దిట్ట అని అన్నారు. అంతేకాకుండా చంద్రబాబుపై సోషల్‌ మీడియాలో వస్తున్న తిట్లు, కామెంట్లు చూస్తుంటే... ఆయనపై జాలేస్తోందని... సీఎం కుర్చీలో తాను ఉంటే ఓ గంట కూడా కూర్చోలేనని దగ్గుబాటి వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై తాను అసూయ పడటం లేదని, కేవలం జాలి పడుతున్నానని అన్నారు. చంద్రబాబు వద‍్ద పనిచేసే అధికారులే ఆయన గురించి సరిగ్గా చెబుతారంటూ ఎద్దేవా చేశారు.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నా తోడల్లుడు చంద్రబాబు సృష్టిలోనే వింత జీవి. నిన్న ఒకమాట...నేడు ఒకమాట.. మాట్లాడుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌, ప్రత్యేక హోదాపై ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. నిన్న మోదీని ....నేడు రాహుల్‌ గాంధీని పొగుడుతారు. రాజధాని భూములను ఒక్కొక్కరికీ ఒక్కో రేటుకు ధారాదత్తం చేశారు. గ్రాఫిక్స్‌తోనే డిజైన్లు చూపుతూ కాలం గడుపుతున్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులతో తాత్కాలిక నిర్మాణాలు చేపడుతున్నారు. కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్‌ నిర్మాణం ఏళ్ల తరబడి జరుగుతోంది. ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం పోర్టుల గురించి రాష్ట్ర ప్రభుత్వం... కేంద్రానికి నివేదికలు ఇవ్వలేదు. ఎన్నికల కోసం మేమే చేస్తామని ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తున్నారు. 

చంద్రబాబు అధికారం కోసం ఏమైనా చేస్తారు. పోలీస్‌ వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలను ఆయన భ్రష్టు పట్టించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనే బాధ్యతను ఇంటెలిజెన్స్‌ ఐజీకి అప్పగించారు. ప్రతిపక్షంలో ఉన్నవారికి కాంట్రాక్టులు అప్పచెపుతామని ఐజీ ప్రలోభపెడుతున్నారు. స్పీకర్‌ వ్యవస్థను కూడా దిగజార్చేశారు. స్పీకర్‌ వ్యవస్థను తూట్లు పొడుస్తూ...ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఇక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ జర్నలిజాన్ని నిర్వీర్యం చేశారు. చంద్రబాబు హయాంలో కడుతున్న ప్రాజెక్టుల్లో రాధాకృష్ణకు కమీషన్లు అందాయి. పట్టిసీమ ప్రాజెక్టుపై రాధాకృష్ణ వాస్తవాలు బయటపెట్టగలరా?. పట్టిసీమ, పోలవరం, హంద్రీనీవా పనుల్లో ఆయనకు ముడుపులు అందాయి. ప్రజలకు మేలు చేసేలా రాధాకృష్ణ జర్నలిజం లేదు.’ అని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు