ఎన్నాళ్లకెన్నాళ్లకు..

20 May, 2019 03:12 IST|Sakshi

చంద్రగిరిలో పాతికేళ్ల తరువాత ఓటు వేసిన దళితులు

ఫలించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి పోరాటం

ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో పటిష్ట బందోబస్తు మధ్య పోలింగ్‌

దొంగ ఓట్లు వేసేందుకు యత్నించిన ఇద్దరు టీడీపీ కార్యకర్తల అరెస్టు  

తిరుపతి సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ 

రీపోలింగ్‌ ప్రశాంతం.. ఊపిరిపీల్చుకున్న యంత్రాంగం

సాక్షి, తిరుపతి/తిరుపతి మంగళం/సాక్షి, అమరావతి: అక్కడ దళితులు తమ ఓటు హక్కును పాతికేళ్ల తర్వాత వినియోగించుకున్నారు. ఈవీఎంలు అంటే ఏమిటో తెలియని వారు ఆదివారం జరిగిన రీ పోలింగ్‌లో తమకు ఇష్టమొచ్చిన వారికి ఓటు వేసి ఎంతో పరవశించిపోయారు. అనంతరం పోలీసులు వారిని బందోబస్తు మధ్య ఇళ్లకు చేర్చారు. మరోవైపు.. టీడీపీ శ్రేణులు దొంగ ఓట్లు వేసేందుకు యత్నించి దొరికిపోయారు. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మొత్తంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడు పోలింగ్‌ బూత్‌లలో ఆదివారం జరిగిన రీపోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. గత నెల 11న జరిగిన ఎన్నికల సందర్భంగా ఎన్‌.ఆర్‌ కమ్మపల్లి, కమ్మపల్లి, వెంకట్రామాపురం, కొత్తకండ్రిగ, పులివర్తి వారి పల్లిలో టీడీపీ నేతలు రిగ్గింగ్‌కి పాల్పడ్డారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు వెళ్లటంతో సీసీ ఫుటేజీలను పరిశీలించిన ఎన్నికల కమిషన్‌ రీపోలింగ్‌కు ఆదేశించిన విషయం తెలిసిందే. అదే విధంగా టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు కాలేపల్లి, కుప్పం బాదూరులో కూడా రీపోలింగ్‌ నిర్వహించింది.  

చెవిరెడ్డి పోరాటం ఫలితంగా..
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోరాటం కారణంగా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ ప్రారంభం కాగానే దళితులు, గిరిజనులు ఓటు వేసేందుకు కేంద్రాలకు తరలివచ్చారు. ఊరుకు దూరంగా ఉన్న వీరందరినీ పోలింగ్‌ కేంద్రాలకు తీసుకొచ్చేందుకు పోలీసులు రక్షణ కల్పించారు. తిరిగి వారు ఇళ్లకు చేరుకునేందుకు కూడా రక్షణగా నిలిచారు. అనంతరం వారంతా ఎంతో సంతోషం వ్యక్తంచేశారు. ‘మాకు తెలిసి ఓటు వేసింది లేదు. ఎప్పుడు వెళ్లినా.. వేలుపై చుక్కపెట్టి పంపేస్తారు. వారే ఓట్లు గుద్దుకునే వారు. ఓటు ఎలా వెయ్యాలో తెలీదు. ఇన్నేళ్ల తరువాత ఓటు వేసినందుకు సంతోషంగా ఉంది’ అని ఎన్‌ఆర్‌ కమ్మపల్లి దళితవాడకు చెందిన మహిళా ఓటర్లు చెప్పారు. కాగా, వీరికి ప్రత్యేకంగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచెయ్యాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి పలుమార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో అనేకమంది అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించి నివేదికలు ఇచ్చారు. ఆ తరువాత గత నెల 11న ఎన్నికల సమయంలో దళిత, గిరిజనులను పోలింగ్‌ కేంద్రానికి రానివ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడం, రిగ్గింగ్‌ చేసుకోవటంతో చెవిరెడ్డి హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించారు. ఆ తరువాత ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి దళిత, గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఎన్నికల సంఘం స్పందించి రీపోలింగ్‌కు ఆదేశాలు జారీచేసింది.

బెదిరింపులు.. ప్రలోభాలు
కాగా, చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలో రీపోలింగ్‌ జరుగుతున్న కమ్మపల్లికి చెందిన టీడీపీ నాయకుడు మునిచంద్రనాయుడు ఆదివారం ఓ వృద్ధురాలి ఓటు వేసేందుకు యత్నించారు. కలెక్టర్‌ ఆదేశాలతో గుర్తించిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఇదే పోలింగ్‌ కేంద్రం వద్ద మరో టీడీపీ నేత జయచంద్రనాయుడు ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. తన తల్లి ఓటు తానే వేస్తానంటూ పోలింగ్‌ అధికారులతో గొడవకు దిగాడు. నిబంధనలకు విరుద్ధంగా అలా ఓటు వేయకూడదని అధికారులు చెప్పినా ఆయన పట్టించుకోలేదు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో జయచంద్ర నాయుడును అదుపులోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉంటే.. రిగ్గింగ్‌కు అవకాశం ఉండదని గ్రహించిన టీడీపీ శ్రేణులు కమ్మపల్లి, వెంకట్రామాపురం దళితుల చేత ప్రమాణాలు చేయించుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో మెజారిటీ తగ్గితే ఎవ్వరూ తిరగలేరని హెచ్చరించారు.

ఏడుచోట్లా భారీ భద్రత
ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న ఏడు రీపోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద ఐఏఎస్‌ స్థాయి అధికారిని నియమించారు. అదే విధంగా డీఐజీ క్రాంతిరాణా టాట పర్యవేక్షణలో ప్రతి కేంద్రం వద్ద డీఎస్పీ స్థాయి అధికారితో పాటు ఎస్పీ, ఏఎస్పీ స్థాయి అధికారులను నియమించారు. అలాగే, ప్రతీచోటా 250 మంది రిజర్వుడు, ఏపీఎస్పీ, పోలీసులతో భద్రతా ఏర్పాట్లుచేశారు. అభ్యర్థుల కదలికలపై కూడా నిఘా ఉంచారు. మరోవైపు.. వెబ్‌ కాస్టింగ్, సీసీ కెమెరాల ద్వారా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న, చంద్రగిరి ఆర్వో మహేష్‌కుమార్‌ తిరుపతి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో పర్యవేక్షించారు. మొత్తంగా రీ పోలింగ్‌ ప్రశాంతంగా ముగియటంతో జిల్లా అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.

89.29 శాతం పోలింగ్‌
ఇదిలా ఉంటే.. గత నెలలో జరిగిన పోలింగ్‌ శాతంతో పోల్చితే ఆదివారం జరిగిన రీపోలింగ్‌లో పోలింగ్‌ శాతం తగ్గింది. ఏడు పోలింగ్‌ కేంద్రాల పరిధిలో మొత్తం 5,451 మంది ఓటర్లు ఉంటే.. గత నెలలో 4,929 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం జరిగిన రీ పోలింగ్‌ సందర్భంగా 4,867 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ లెక్కన 1.13 శాతం ఓటింగ్‌ తగ్గింది. ఎండ తీవ్రంగా ఉన్నా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపించారు. 

దళితులు ఎంతో సంతోషించారు : పెద్దిరెడ్డి
రీపోలింగ్‌ జరుగుతున్న వెంకట్రామాపురం పోలింగ్‌ కేంద్రాన్ని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రీ పోలింగ్‌ సందర్భంగా ఎన్‌.ఆర్‌ కమ్మపల్లిలో దళితులు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోవటం హర్షించదగ్గ పరిణామమని అన్నారు.  ప్రతి ఎన్నికల్లో వారి ఓట్లను రిగ్గింగ్‌ చేసేవారన్నారు. భారీ బందోబస్తు మధ్య తొలిసారి తమ ఓటు హక్కు వినియోగించుకున్నందుకు గ్రామస్తులు ఎంతో ఆనందం వ్యక్తంచేశారని ఆయన తెలిపారు. కాగా, రాష్ట్రంలో 120–130 స్థానాల్లో వైఎస్సార్‌సీపీదే గెలుపు అని ధీమా వ్యక్తంచేశారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సర్వేను కొట్టిపారేశారు. బెట్టింగ్స్‌ కోసమే ఆయన సర్వేలని చెప్పారు.

దళితులు స్వేచ్ఛగా ఓటు వేశారు : చెవిరెడ్డి
చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని కుప్పం బాదూరు పంచాయితీలో రీపోలింగ్‌ ద్వారా దళితులు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే  చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. రీపోలింగ్‌ నిర్వహించిన సరళిపై ఆయన మీడియాతో మాట్లాడారు.  ఇన్నాళ్ళకు వారు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కుతో వారి కళ్ళల్లో ఆనందం చూశానన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చి మరీ ఓటువేశారన్నారు. రీపోలింగ్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్ధం కావడంలేదని చెవిరెడ్డి చెప్పారు. 

ఓట్లు లాక్కొని వాళ్లే వేసుకునేవాళ్లు..
ఎన్నికలు వచ్చాయంటే లైన్‌లో రావటం.. వేలిపై సిరా వేసుకోవటం వరకే మాకు తెలుసు. వేలిపై సిరా గుర్తు వేసుకోగానే మీ ఓటు వేసేశాం వెళ్లిపోండి అనేవారు. ఓటింగ్‌ అంటే అంతే అనుకునే వాళ్లం. ఓట్లు లాక్కొని వాళ్లే వేసుకునే వారు. గుర్తులపై ముద్ర వేయటం, నొక్కితే గుర్తుల వద్ద లైటు వెలగటం అనేవి మాకు తెలీదు. రీపోలింగ్‌ పుణ్యామా అని మా ఓటు మేం వేసుకున్నాం.
– దేశమ్మ, ఎన్‌.ఆర్‌ కమ్మపల్లి, చంద్రగిరి నియోజకవర్గం 

బతికుండగా నా ఓటు నేను వేస్తాననుకోలేదు
ఎన్నికల్లో మా ఓటు మేం వేసుకున్నదే లేదు. ఎవరో మా ఓటు వేసుకునే వారు. అడిగే ధైర్యం కూడా లేదు. నా ఓటు నేను వేసుకోకుండానే చచ్చిపోతాననుకున్నా. కానీ, మా బాధను అర్థం చేసుకున్న మహానుభావుడు రీపోలింగ్‌ పెట్టించాడు. అధికారులు, పోలీసులు ధైర్యం చెప్పారు. దీంతో స్వేచ్ఛగా నచ్చిన పార్టీకి ఓటు వేసుకున్నాం. 
– మంగమ్మ, ఎన్‌.ఆర్‌ కమ్మపల్లి, చంద్రగిరి నియోజకవర్గం 

రీపోలింగ్‌ ప్రశాంతం : ద్వివేది
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడుచోట్ల ఆదివారం జరిగిన రీ–పోలింగ్‌ స్వల్ప సంఘటనల మినహా ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గతంలో ఓట్లు వేయని దళితులు ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకోవడంపై సంతోషం వ్యక్తంచేశారు. సచివాలయంలో ఆదివారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. సాధారణంగా రీ–పోలింగ్‌లో ఓట్ల శాతం చాలా తక్కువగా ఉంటుందని, కానీ.. ఇక్కడ అలా జరగలేదన్నారు. ఏప్రిల్‌ 11న జరిగిన ఎన్నికల్లో ఇక్కడ 90.42 శాతం ఓటింగ్‌ నమోదైతే.. ఆదివారం 1.13 శాతం తగ్గి 89.29 శాతం నమోదయ్యిందన్నారు. 

మరిన్ని వార్తలు