‘రైతుబంధు నాకొద్దు’

8 May, 2018 02:16 IST|Sakshi

జోగిపేట(అందోల్‌): రైతుబంధు పథకం పేరుతో తన తల్లి జానాబాయి పేర ఉన్న వ్యవసాయ భూమికి వచ్చే చెక్కును తీసుకోనని, దానిని గౌరవంగా తిరస్కరిస్తున్నామని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రకటించారు. సోమవారం ఆయన సాక్షితో ఫోన్‌లో మాట్లాడారు. మంత్రి హరీశ్‌రావు సింగూరు పర్యటన సందర్భంగా దామోదర తల్లి జానాబాయి పేర ఉన్న 20 ఎకరాలకు పెట్టుబడి పథకం కింద రూ.1.60 లక్షలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. దీనిపై స్పందించిన రాజనర్సింహ ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సహాయం తమకు వద్దన్నారు.

రాష్ట్రంలో 60 నుంచి 70 శాతం మంది కౌలు రైతులే పంటలను పండించుకుంటున్నారన్నారు. వారికి ప్రభుత్వం న్యాయం చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. బడా రైతుల గురించి కాకుండా చిన్న, సన్న కారు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఏ మేరకు ఆదుకున్నారో శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు