‘వైఎస్సార్‌ శిష్యుడినని గర్వంగా చెప్పుకుంటా’

1 Oct, 2018 02:55 IST|Sakshi

జోగిపేట (అందోల్‌)/ సంగారెడ్డి క్రైమ్‌: దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ , 108 అంబులెన్స్‌ పథకాలు చరిత్రలో మిగిలిపోతాయని కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా జోగిపేట మండలం డాకూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో దివంగత నేత వైఎస్సార్‌ గురించి ప్రస్తావించారు. తాను వైఎస్సార్‌ శిష్యుడినని సగౌరవంగా చెప్పుకుంటానని అన్నారు.

రాజకీయంగా ఓనమాలు నేర్పిన ఆయన నుంచి కొన్ని సిద్ధాంతాలు కూడా నేర్చుకున్నానని చెప్పారు. మాట ఇస్తే దానిపై నిలబడాలని, ప్రజలను మోసం చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని, వాగ్దానం చేస్తే నిలబెట్టుకోవాలని సూచిస్తుండే వారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తాను అదే మార్గంలో నడుస్తున్నట్లు చెప్పారు. హామీలంటే వైఎస్సార్‌ ఇచ్చిన హామీల లాగే ఉండాలన్నారు. పాదయాత్ర చేస్తూ కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే విద్యుత్‌ బకాయిలను మాఫీ చేస్తానని, ఉచిత కరెంటు ఇస్తానని, బకాయిల మాఫీకి సంబంధించిన ఫైల్‌పై మొదటి సంతకం పెడతానని చెప్పి చేసిన వాగ్దానాలు నెరవేర్చారన్నారు.
 
అన్ని వర్గాలకు న్యాయం..
రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా కాంగ్రెస్‌ మేనిఫెస్టో ఉంటుందని రాజనర్సింహ అన్నారు. సమాన పనికి సమాన వేతనం, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన, మెగా డీఎస్సీ, రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ, ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించే దిశగా మేనిఫెస్టో ఉంటుందన్నారు. 

మరిన్ని వార్తలు