సచివాలయంపై కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు

12 Jul, 2020 03:23 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ప్రెస్‌మీట్‌లో టీఆర్‌ఎస్‌ నేతలు

సాక్షి, హైదరాబాద్‌: సచివాలయం కూల్చివేతపై ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ హైకోర్టును తప్పుదోవ పట్టించాయని మాజీ మంత్రి దానం నాగేందర్‌ ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీలు ఎంఎస్‌ ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డితో కలసి శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. హైకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాతే సచివాలయం కూల్చివేతలు ప్రారంభమైన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆరేళ్లుగా అభివృద్ధి జరుగుతున్నా కళ్లుండీ చూడలేని కబోదులుగా విపక్షాలు మారాయని విమర్శించారు. వరుస ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తున్నా ప్రతిపక్షాల వైఖరి మారడం లేదని, రాబోయే రోజుల్లో విపక్షాలకు బంగాళాఖాతమే దిక్కవుతుందన్నారు. 

సచివాలయంలో దేవాలయం, ప్రార్థనా మందిరం దెబ్బతినడంపై సీఎం కేసీఆర్‌ వివరణ ఇవ్వడంతో పాటు మత పెద్దలతో కూడా మాట్లాడారని జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు. మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో రోడ్ల విస్తరణ పేరిట ప్రార్థనా మందిరాలను కూల్చివేశారన్నారు. మతాల నడుమ చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. హైదరాబాద్‌లో మత సామరస్యానికి భంగం వాటిల్లకుండా చూస్తామని, విపక్షాల కుట్రలను అనుమతించేది లేదన్నారు.

సచివాలయం శిథిలాలను తిరిగి వినియోగించుకునేందుకు జీడిమెట్లలో ప్రత్యేక ప్లాంటు నెలకొల్పినట్లు బొంతు రామ్మోహన్‌ వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న గంగా జమునా తెహజీబ్‌ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని ఎమ్మెల్సీ ప్రభాకర్‌ అన్నారు. కొత్త సచివాలయం రాష్ట్ర అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తుందని, ప్రతిపక్షాల తీరు మారకుంటే మరింతగా ప్రజలకు దూరమవడం ఖాయమని ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు