వైఎస్ జగన్ విలువలు నచ్చాయి: జై రమేష్‌

15 Feb, 2019 18:22 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ప్రభంజనం

వైఎస్ జగన్‌కు విజయం ఖాయం 

టీడీపీ నుంచి నేను సంపాదించింది ఏమీ లేదు

పార్టీకి.. చంద్రబాబుకు నేను ఎంతగానో సాయం చేసాను

చంద్రబాబు సీఎం కావడానికి నేను కూడా ఒక కారణం

సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇస్తే దానిమీద నిలబడతారని దాసరి జై రమేష్‌ అన్నారు. ఆయన శుక్రవారం వైఎస్‌ జగన్‌ను హైదరాబాద్‌లో కలిశారు. భేటీ అనంతరం దాసరి జై రమేష్‌ వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్ నూటికి నూరుపాళ్లు విజయం సాధించడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. మంచిరోజు చూసుకుని త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు జై రమేష్ తెలిపారు. తాను పోటీ చేసినా, చేయకపోయినా పార్టీలో మాత్రం చేరతానని చెప్పారు. తమ భేటీలో ఎలాంటి డిమాండ్లు లేవని, పార్టీ విషయాలు, ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించామని వెల్లడించారు. వైఎస్ జగన్‌తో కలిసి నడిచేందుకు నిర్ణయించుకున్నట్లు జై రమేష్‌ తెలిపారు. జగన్‌కు ఉన్న ప్రజాదరణ చూస్తున్నామని రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ప్రభంజనం వీస్తుందన్నారు.


’వైఎస్ జగన్ ఓ మాట ఇస్తే...దానిమీద నిలబడతారు. చంద్రబాబు నాయుడులా వంద వాగ్దానాలు చేసి ఒక్కటీ కూడా నిలబెట్టుకోకుండా ఉండేవాళ్లు కాదు. నేను 2001 నుంచి టీడీపీకి దూరంగా ఉన్నా. 1999 ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ, విజయవాడ పార్లమెంట్‌ సీటు ఇస్తామని చంద్రబాబు మాట తప్పారు. అప్పటి నుంచి నేను తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నా. నేను ఇప్పుడు టీడీపీ సభ్యుడిని కాదు. 35 ఏళ్ల పాటు మేం పార్టీకి త్యాగం చేశాం. పార్టీ ద్వారా కానీ, ప్రభుత్వం నుంచి కానీ రూపాయి ఆశించలేదు. చంద్రబాబుకు కూడా నేను వ్యక్తిగతంగా సాయం చేశా. ఆయన ముఖ్యమంత్రి కావడానికి కూడా సహకరించాను. నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయినప్పుడు టీడీపీని కాపాడటానికి నా వంతు ప్రయత్నాలు చేశాను. 


తెలుగు జాతిని అవమానించేలా చంద్రబాబు నాయుడు పాలన సాగుతోంది. అయిదేళ్ల చంద్రబాబు పాలనలో ఉన్నంత అవినీతి నా జీవితంలో చూడలేదు. రాజధాని అమరావతి నిర్మాణం ఇప్పటివరకూ కూడా కుంటినడకే నడుస్తోంది. టీడీపీలో ప్రతి ఎమ్మెల్యే మొదటి రెండేళ్లలోనే రూ.50 నుంచి రూ.200 కోట్లు సంపాదించారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో ప్రతి ఎమ్మెల్యే రూ.50-100 కోట్లు దోచుకున్నారని ఓ ఎంపీనే స్వయంగా నాతో అన్నారు. ఈ విధంగా రాష్ట్రాన్ని దోచుకుని ప్రజలకు ఏం మంచి చేయగలుగుతారు. ప్రతి పనికి ఇరవై శాతంపైగా కమీషన్లు డిమాండ్ చేస్తున్నారు. బాబు ప్రభుత్వంలో ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఉంది. ప్రభుత్వం అన్నింటిలో విఫలమైంది. త‍్వరలో మంచి రోజుల వస్తాయి.’ అని అన్నారు. జై రమేష్‌ వెంట దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్‌, వైఎస్సార్‌ సీపీ నేతలు విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు