బుద్ధా.. మీ మాటలు వెనక్కితీసుకోండి: దాసరి ఫ్యామిలీ

2 Apr, 2019 14:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ సినీ నటుడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు మోహన్‌బాబును ఉద్దేశించి.. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకట్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మోహన్‌బాబును విమర్శిస్తూ.. దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు గురించి ప్రస్తావించడంపై ఆయన కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మోహన్‌బాబు తమకు పెద్ద అన్నయ్యలాంటి వారు అని, నాన్న చనిపోయిన తరువాత అన్ని ఆయనే చూసుకుంటున్నారని దాసరి నారాయణరావు పెద్ద కొడుకు తారకప్రభు తెలిపారు.

దాసరి నారాయణరావుకు మోహన్ బాబు పంగనామాలు పెట్టారని బుద్ధా వెంకన్న అన్నారని, ఈ వ్యాఖ్యలను ఆయన వెంటనే వెనక్కి తీసుకోవాలని  తారకప్రభు కోరారు. తాము ఎప్పుడైనా, ఎక్కడైనా మోహన్ బాబు తమను మోసం చేశారని చెప్పమా? తాము  చెప్పకుండా ఈ విషయంలోకి దాసరిని ఎందుకు లాగారని బుద్ధా వెంకన్నను ఆయన ప్రశ్నించారు. దాసరి నారాయణరావు గారి పెద్ద కోడలు పద్మ స్పందిస్తూ.. ‘మోహన్‌బాబు నన్ను అమ్మా అని పిలుస్తారు. నన్ను కూతురిలా ఆయన చూసుకుంటారు. మా రెండు కుటుంబాలు సన్నిహితంగా ఉంటాయి. బుద్ధా వెంకన్నగారూ.. మీ మాటలను వెనక్కి తీసుకోండి. రాజకీయాల కోసం మా కుటుంబాన్ని ఇందులోకి లాగకండి’ అని హితవు పలికారు.

మరిన్ని వార్తలు