‘ఏ అమరులు చెప్తే వారికి పదవులిచ్చారు’

25 Sep, 2018 16:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైన వారి గురించి మాట్లాడే నైతిక అర్హత టీఆర్‌ఎస్‌లో ఎవరికి లేదని కాంగ్రెస్‌ నాయకులు దాసోజు శ్రవణ్‌ విమర్శించారు. మంగళవారం ఆయన కాంగ్రెస్‌ నాయకులు అద్దంకి దయాకర్‌, మదన్‌మోహన్‌రావులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ నాయకులు అమరుల పేరు చెబితే చనిపోయిన వారి ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. కేసీఆర్‌ నిరహార దీక్ష చేస్తే.. ఆత్మహత్య చేసుకుందామంటే హరీష్‌రావుకు అగ్గిపుల్ల కూడా దొరకలేదని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ జాతి, నీతి లేని పార్టీ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏ అమరులు చెప్తే మహేందర్‌ రెడ్డికి, తుమ్మల నాగేశ్వరరావుకి మంత్రి పదవులిచ్చారని ప్రశ్నించారు.

టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ రౌడీల పార్టీ అని ఆరోపించారు. తెలంగాణ గౌరవాన్ని ఆంధ్ర కాంట్రాక్టర్లకు తాకట్టుపెట్టారని విమర్శించారు. విమర్శలు చేస్తే ఎన్నికలకు పోతామంటున్నారు.. అలాగైతే టీఆర్‌ఎస్‌ జీవితాంతం ఎన్నికలకు పోవాలని జోస్యం చెప్పారు. టీఆర్‌ఎస్‌ పొత్తులు పెట్టుకుంటే మంచి.. కానీ కాంగ్రెస్‌ పొత్తులు పెట్టుకుంటే అనైతికమా అని ప్రశ్నించారు. 2009లో సీపీఎం, టీడీపీలతో టీఆర్‌ఎస్‌ పొత్తు ఎలా పెట్టుకుందని నిలదీశారు. తమది ప్రజల కూటమని.. దొంగల కూటమి కాదని తెలిపారు. తమ అధిష్టానం ఢిల్లీలో ఉందని.. మరి కేసీఆర్‌ ఎందుకు ఢిల్లీకి వెళ్తున్నారో చెప్పాలని అన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య రహస్య ఎజెండా ఏమిటని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలోని ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చలేదని.. అందులో ఏ పేజీపైనైనా తాను చర్చకు సిద్దంగా ఉన్నట్టు వెల్లడించారు.

అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ తామిచ్చిన తెలంగాణను పాలిస్తూ.. తామిచ్చిన మెట్రో ప్రారంభించి.. తామిచ్చిన ఇళ్లను ప్రారంభిస్తోందని విమర్శించారు. అమరుల కుటుంబాలను కాంగ్రెస్‌ పెన్షన్‌ ఇవ్వాలనే ఆలోచన చేస్తుందని తెలిపారు. ఉద్యమ సమయంలో చేపట్టిన సాగర హారంలో కేసీఆర్‌ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. అలీబాబా అరడజన్‌ దొంగల లెక్క తెలంగాణను టీఆర్‌ఎస్‌ దోచుకుంటుందని ఆయన ఆరోపించారు. మదన్‌మోహన్‌రావు మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ నాయకులు కౌరవులైతే.. కాంగ్రెస్‌ నాయకులు పాండవులని అన్నారు. ఏం అభివృద్ధి చేశారని సోషల్‌ మీడియా ద్వారా టీఆర్‌ఎస్‌ను ప్రజల్లోకి తీసుకెళతారని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు