మంత్రి మాట్లాడరు.. ముఖ్యమంత్రి కనబడరు

22 Apr, 2019 17:47 IST|Sakshi

ఇంటర్‌బోర్డ్‌ అవకతవకలపై దాసోజు ఫైర్‌

న్యూఢిల్లీ : ఇంటర్‌ బోర్డ్‌లో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు ఏఐసీసీ అధికారప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కుమార్‌ బహిరంగ లేఖ రాశారు. ఇంటర్‌ బోర్డ్‌ తప్పిదం వల్ల 25 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకొని, వేలాది మంది రొడ్డెకినా కనీసం భరోసం కల్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉండటం బాధకరమన్నారు. ఒక కమిటీ వేసి నిమ్మకు నిరెత్తనట్లుగా వ్యవహరించడం శోచనీయమన్నారు. ఇంటర్‌ బోర్డు అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అనుభవం లేని  గ్లోబరెనా అనే సంస్థ మూలంగా వేలాదిమంది విద్యార్థుల జీవితాలు అందకారంలోకి నెట్టబడ్డాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా  గ్లోబరెనా సంస్థకు మూల్యాంకనం బాధ్యతలు ఇచ్చిన విధానంపై న్యాయవిచారణ జరిపించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తించిన అశోక్‌ అనే అధికారిని బర్త్‌రఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

సాధికారికత లేని కమిటీ వేసి ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని, మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌లా విద్యాశాఖమంత్రి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇంబర్‌బోర్డ్‌ అవకతవకలపై మంత్రి మాట్లాడరని, ముఖ్యమంత్రి కనబరని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రజల గోడు వినేవాడు ఎవరులేరని, విద్య, వైద్యం వంటి కీలక శాఖలపై ప్రభుత్వానికి స్పష్టమైన వైఖరి లేదని విమర్శించారు. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పాలకులకు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ పరిపాలనపై లేకపోవడం బాధాకరమని ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు