భజన కోసమే అసెంబ్లీ

30 Mar, 2018 02:45 IST|Sakshi

టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌  

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు భజన చేసేందుకే నిర్వహించారని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌కుమార్‌ విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షం లేకుండా కల్వకుంట్ల రాజ్యంలో దుర్యోధనుడి స్ఫూర్తితో సభ నడిపించారని అన్నారు. రాష్ట్ర సంపదను పెంచామని అసెంబ్లీలో చెబుతున్న కేసీఆర్‌.. రాష్ట్ర అప్పులను కూడా పెంచామని చెబితే బాగుండేదని పేర్కొన్నారు.

గురువారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏ రంగానికి ఎంత కేటాయించామో, ఎంత ఖర్చు చేశామో చెప్ప కుండా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ పెద్ద బోగస్‌ అని, దీన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. ఎంబీసీ కార్పొరేషన్‌కు గత బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా మళ్లీ ఇప్పుడు రూ.2,000 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పడం సిగ్గుచేటని అన్నారు.

అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రైతులకు వ్యవసాయభూమి, ఇళ్లు, ఉచిత విద్య అందిస్తామన్న హామీలు ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. దళితులకు మూడెకరాల విషయంలో తాము అందరికీ ఇస్తామని చెప్పలేదని కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా చెబు తున్న మాటలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. గిరిజన, మైనార్టీలకు రిజర్వేషన్లు, డబుల్‌ బెడ్‌రూం విషయంలో ప్రజలను కేసీఆర్‌ మోసగిస్తున్నారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు