టీచర్స్‌ ట్రాన్స్‌ఫర్లలోనూ అవినీతి: దాసోజు

19 Aug, 2018 12:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టీచర్స్‌, లెక్చరర్స్‌ బదిలీల్లో భారీ అవినీతి చోటుచేసుకుందని కాంగ్రెస్‌ నేత దాసోజ్‌ శ్రవణ్‌ కుమార్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన సీఎం కేసీఆర్‌కు ఓ బహిరంగ లేఖరాశారు. విద్యాబుద్దులు నేర్పి సమాజానికి ఆదర్శవంతంగా నిలవాల్సిన విద్యాశాఖలో కూడా అవినీతి జరగడం దారుణమన్నారు. నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత కూడా భార్యాభర్తల కు సంబంధించిన అంతర్ జిల్లా బదిలీలకు అనుమతి ఇవ్వకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. 

2018 జూన్ 6 న మొదలుపెట్టి నెలరోజుల పాటు నిర్వహించిన ఉపాధ్యాయుల బదిలీలను వెబ్‌ కౌన్సెలింగ్‌తో విజయవంతంగా ముగించామని చెప్పుకుంటున్నారని, కానీ అంతర్జిల్లా బదిలీలకు అవకాశం ఇవ్వక పోవడం వెనుక ఉద్దేశాలేంటో అర్ధం కావడం లేదన్నారు. ‘దేవుడు వరమిచ్చినా పూజారి వరమియ్యేలేదు’  అన్నట్లుగా ఓ వైపు ప్రభుత్వం జీవో విడుదలచేసినా విద్యాశాఖ ఎందుకు అంతర్జిల్లా బదిలీలను చేపట్ట లేకపోయిందో సమాధానం చెప్పాలని సీఎంను ప్రశ్నించారు. 

కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామన్న హామీని మరిచిపోయారన్నారు. సుదీర్ఘ కాలంగా ఒకేచోట పనిచేస్తున్న వారిని ట్రాన్స్ ఫర్ చేస్తామని  క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నా కూడా ఎందుకు ఆచరణలో పెట్టలేకపోయారని ప్రశ్నించారు. నోటిపికేషన్ విడుదల చేయకుండా ఉద్యోగాలను భర్తీచేయకుండా  గెస్ట్ లెక్చరర్‌ల పేరిట కళాశాలలను నడుపుతున్నారని, ఇలా పూర్తి స్ధాయి లెక్చరర్లు , ప్రిన్సిపాల్  లేకుండా ఇంచార్జీలతో కాలం వెళ్లదీస్తుంటే నాణ్యమైన విద్య ఎలా అందుతుందో చెప్పాలని నిలదీశారు.

మరిన్ని వార్తలు