కొండా మురళికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సవాల్‌

25 Sep, 2018 16:39 IST|Sakshi
దాస్యం వినయ్‌భాస్కర్‌, కొండా దంపతులు (పాత చిత్రం)

సాక్షి, వరంగల్‌ అర్బన్‌ : కేసీఆర్‌ సర్వేలో అనుకూల ఫలితాలు రానందునే టీఆర్‌ఎస్‌ పార్టీ కొండా సురేఖకి టికెట్‌ నిరాకరించిందని వరంగల్‌ పశ్చిమ తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. రాజకీయంగా బీభత్సమైన పలుకుబడి ఉందని చెప్పుకుంటున్న కొండా మురళి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్‌ విసిరారు. మురళి ఏకగ్రీవంగా ఎన్నికైతే​ రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ విసిరారు. పార్టీ కార్యాలయంలో ఎంపీ పసునూరి దయాకర్‌తో కలిసి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

భూ కబ్జాలు, బెదిరింపులకు పాల్పడిన కొండా దంపతులు ప్రజలు, కార్యకర్తలు, మైనారిటీలను దూరం చేసుకున్నారని విమర్శలు గుప్పించారు. వారి భూ కబ్జాలకు హన్మకొండలోని రామ్‌నగర్‌లో ఉన్న భవనమే సాక్షి అని విజయ్‌భాస్కర్‌ ఆరోపించారు. ప్రజల్లో ఏ మాత్రం పలుకుబడి లేదు కనుకనే రాష్ట్రంలో లేని పార్టీలు పిలిచాయని చెప్పుకుంటున్నారని అన్నారు. ఉద్యమకారులకు కేసీఆర్‌ అత్యన్నత పదవులు కట్టబెట్టారని గుర్తుచేశారు. అవినీతి చరిత్ర కలిగిన కొండా దంపతులు ఉద్యమకారుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

మీవెంట ఒక్క కార్పొరేటర్‌ అయినా ఉన్నాడా..!
అధికారం ఉన్నంతకాలం పార్టీని వాడుకుని ఇవాళ కేసీఆర్‌, కేటీఆర్‌ పట్ల కొండా దంపతులు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఎంపీ పసునూరి దయాకర్‌ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలోని ఏ ఒక్క కార్పొరేటర్‌ కూడా కొండా దంపతులకు తోడుగా లేరంటేనే వారి నైజం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌పై కూడా వారు విమర్శలు చేయడం దారుణమన్నారు. తమ సమస్యలు తీర్చాలని ఇంటికొచ్చిన ప్రజలతో కాళ్లు మొక్కించుకునే నియంతృత్వం కొండా దంపతులదని దయాకర్‌ నిప్పులు చెరిగారు. కాగా.. అసెంబ్లీ రద్దు అనంతరం 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించిన కేసీఆర్‌.. వరంగల్‌ తూర్పు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా సురేఖకు టికెట్‌ నిరాకరించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు