కాంగ్రెస్‌ లోక్‌సభ పక్షనేత ఎన్నికపై ఉత్కంఠ

16 Jun, 2019 17:06 IST|Sakshi

రేపటి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు

సాక్షి, న్యూఢిల్లీ: రేపటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అవుతున్నప్పటికీ.. కాంగ్రెస్‌ మాత్రం ఇప్పటికీ లోక్‌సభ పక్షనేతను ప్రకటించలేదు. కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన కాంగ్రెస​ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీమే ఆపార్టీ పదవిని చేపడతారని ప్రచారం జరగినప్పటికీ.. రాహుల్‌ మాత్రం సిద్ధంగా లేనట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని పట్టుబడుతున్న విషయం తెలిసిందే.  రాహుల్‌ రాజీనామాను పార్టీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీజేపీని ఎదుర్కొనే సమర్థ నాయకుడు ఎవరన్న దానిపై పార్టీలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఫలితాలు విడుదలై ఇరవై రోజులకుపైగా కావస్తున్న.. ఇప్పటికీ స్పష్టత రాలేదు.

16వ లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేతగా వ్యవహరించిన మల్లికార్జున ఖర్గే ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో మరో నేతను ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఈ నేపథ్యంలో పలవురు సీనియర్‌ నేతల పేర్లను పార్టీ అధిష్టానం పరిశీలిస్తోంది. ఈ క్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు శశిథరూర్‌, మనీశ్‌ తివారీ, బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్‌ రంజన్‌ చౌదరి, కేరళకు చెందిన కే.సురేశ్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అధికార పార్టీని సమర్థవంతంగా ఎదుర్కొవడం, ప్రజా సమస్యలపై గళమెత్తగల నేతను ఎన్నుకోవాలని పార్టీ భావిస్తోంది. అయితే అధిష్టానానికి విధేయుడిగా ఉండి, హిందీ, ఇంగ్లీష్‌ భాషాలపై పట్టున్న నాయకుడి కోసం అన్వేషిస్తున్నారు.

వీరిలో తిరువనంతపురం నుంచి గెలిచిన, కేంద్రమాజీ మంత్రి శశిథరూర్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. భాషపై పట్టుతో పాటు, అన్ని అంశాల్లో ప్రావీణ్యం కలిగి ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశం. మరోవైపు కేరళకు చెందిన కే.సురేశ్‌.. పార్టీకి ఎంతో కాలంగా విధేయుడిగా ఉన్నారు. అయితే ఈయనకు హిందీ, ఇంగ్లీష్‌లో అంతగా ప్రావీణ్యం లేదు. బెంగాల్‌కు చెందిన అధిర్‌ చౌదరిది కూడా దాదాపు ఇదే పరిస్థితి. దీంతో వీరివురు రేసులో వెనకబడే అవకాశం ఉంది. అయితే ఇటీవల వెలువడిన ఫలితాల్లో దక్షిణాదిన ఆపార్టీ మంచి ఫలితాలనే సాధించింది. ముఖ్యంగా కేరళలో మెజార్టీ స్థానాలు గెలుపొందింది. దీంతో ఉత్తర, దక్షిణాది సమీకరణాలు కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు