బీజేపీలోని దోస్తులకు ఒమర్‌ అబ్దుల్లా థ్యాంక్స్‌!

14 Mar, 2018 16:41 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆసక్తిరేపిన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌, ఫూల్‌పుర ఉప ఎన్నికలు బీజేపీకి గట్టిషాక్‌ను ఇచ్చాయి. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ  (ఎస్పీ) అనూహ్యంగా పుంజుకొని ఘనవిజయం దిశగా సాగుతోంది. ఎస్పీకి బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) మద్దతుగా నిలువడంతో.. బీజేపీకి తన కంచుకోటల్లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీఎం యోగిఆదిత్యనాథ్‌ సొంత నియోజకవర్గం, కాషాయ కంచుకోటగా భావించిన గోరఖ్‌పూర్‌లోనూ బీజేపీకి ఎదురుగాలి వీచింది. 2019 లోక్‌సభ ఎన్నికలకు రాజకీయ సమీకరణాలను నిర్దేశించేవిగా భావించిన ఈ ఎన్నికలు.. కమలం శ్రేణులకు గట్టి గుణపాఠమే నేర్పాయి. అధికార పార్టీగా ఉన్నప్పటికీ, తను రాజీనామా చేసిన సీట్లను ఆ పార్టీ నిలబెట్టుకోకపోవడం మారిన రాజకీయ సమీకరణలను చాటుతోంది. అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఎస్పీ, మాయావతి అధినేత్రిగా ఉన్న బీఎస్పీ చేతులు కలిపి.. రాజకీయంగా కీలకమైన యూపీలో బీజేపీకి ఎదురుగాలి తప్పదని ఈ ఉప ఎన్నికలు సంకేతం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల ఫలితాలపై రాజకీయ నాయకులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం నేపథ్యంలో అఖిలేశ్‌కు, మాయావతికి తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ అభినందనలు తెలిపారు. బిహార్‌లోని అరారియా, జెహానాబాద్‌ ఉప ఎన్నికల్లో ఆర్జేడీ విజయం దిశగా సాగుతుండటంతో ఆ పార్టీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌కు కూడా మమత కంగ్రాట్స్‌ చెప్పారు.

మరోవైపు ఈ ఫలితాల నేపథ్యంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఒమర్‌ అబ్దుల్లా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీలోని నా స్నేహితులకు ధన్యవాదాలు. మీ కటోరమైన శ్రమ, నిరంతర కృషితో నా అంచనా తప్పు అని నిరూపించారు. ఇందుకు నేను కృతజ్ఞుడిని. మీ ఫ్రెండ్లీ ప్రతిపక్ష నేత’ అంటూ ఒమర్‌ ట్వీట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి.. గత ఏడాది మార్చిలో చేసిన ట్వీట్‌ను ఉటంకిస్తూ ఆయన ఈ కామెంట్‌ చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో.. ఇక ప్రతిపక్షాలు 2019 లోక్‌సభ ఎన్నికల సంగతిని మరిచిపోయి.. 2024 ఎన్నికల కోసం సన్నాహాలు ప్రారంభిస్తే మేలు అని ఆయన ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్‌ తప్పు అని బీజేపీలోని తన స్నేహితులు నిరూపించారని ఆయన తాజాగా చమత్కరించారు.

>
మరిన్ని వార్తలు