రాష్ట్రంపై అప్పుల భారం పెరుగుతోంది

26 Dec, 2018 04:07 IST|Sakshi

సంక్షేమ రంగంపై మూడో శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు 

భారీగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన రాష్ట్రం మరొకటి లేదు 

ఎన్నికల మేనిఫెస్టోలో లేనివి కూడా అమలు చేస్తున్నాం.. 

పశ్చిమ గోదావరిలో పరిశ్రమలు పెట్టేందుకు భూములు లేవు 

తెలంగాణ సీఎం ఒడిశాలో పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడటం సరికాదు

సాక్షి, అమరావతి: రాష్ట్రంపై అప్పుల భారం పెరుగుతోందని, అయినా బ్యాలెన్స్‌ చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లలో సంక్షేమ కార్యక్రమాలకు రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. ఇవికాకుండా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ వంటి పథకాలకు రూ.వేల కోట్లు వెచ్చించామన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఇంత పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన రాష్ట్రం మరొకటి లేదని పేర్కొన్నారు. ఆయన మంగళవారం ఉండవల్లిలోని గ్రీవెన్స్‌ సెల్‌లో సంక్షేమ రంగం, సామాజిక సాధికారితపై మూడో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. సాంఘిక సంక్షేమానికి రూ.40,253 కోట్లు, గిరిజన సంక్షేమానికి రూ.14,210 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.39,138 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి రూ.3,215 కోట్లు, కాపు కార్పొరేషన్‌కు రూ.3,004 కోట్లు ఇచ్చామని చంద్రబాబు చెప్పారు. సంక్షేమ రంగంలో తాము అమలు చేసిన కార్యక్రమాలు దేశానికే ఒక మోడల్‌ అని వెల్లడించారు. 

ధనిక రాష్ట్రాల్లోనూ ఇంత సంక్షేమం లేదు 
2014 సంవత్సరానికి ముందు రాష్ట్రంలో ఎటువంటి సంక్షేమం లేదని, తాను వచ్చాకే అన్నింటినీ గాడిన పెట్టానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలకు సంతృప్తకర స్థాయిలో నిత్యావసరాలను అందిస్తున్నామన్నారు. ఉపకార వేతనాలు, ఉచిత విద్యుత్‌ వంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నామని. ధనిక రాష్ట్రాల్లో కూడా ఇంత సంక్షేమం లేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవే కాకుండా, అందులో లేనివి కూడా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమాంతరంగా చూస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. రూ.2,000 నోట్లను రద్దు చేస్తే తప్ప ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని నిలువరించలేమని స్పష్టం చేశారు.  

పోలవరం, రాజధాని కట్టి చూపించా..
ప్రతిపక్ష నాయకుడు అదిస్తాం, ఇదిస్తాం అని హమీలు గుప్పిస్తున్నారని, ఆయనకు ఏం అనుభవం ఉందని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో మాటలు చెప్పి ఏమీ చేయలేదని, ఆయనకు అనుభవమైనా ఉందని, రాష్ట్రంలో ప్రతిపక్ష నేతకు అది కూడా లేకుండా అన్నీ చేస్తానని చెబుతున్నాడని విమర్శించారు. అన్నీ ఇస్తామని చెప్పిన తర్వాత ఏదీ ఇవ్వలేని పరిస్థితి వస్తే ఏంచేస్తారని, సంపద సృష్టించకుండా ఎలా చేస్తారని ప్రశ్నించారు. తనను పోలవరం ప్రాజెక్టు నిర్మించలేరని, రాజధాని నిర్మించలేరని అన్నారని, ఇప్పుడు కట్టి చూపించానని పేర్కొన్నారు. ఏదో ఇచ్చేస్తారనేది ఊహ, ఇప్పుడు ఇస్తున్నది వాస్తవమని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఒడిశా రాష్ట్రానికి వెళ్లి, పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడటం సరికాదన్నారు. 

ఇక్కడ కాదు.. ఢిల్లీలో ధర్నా చేయాలి 
తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే రాజీనామాపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేసినట్లే తాడేపల్లిగూడేన్ని కూడా అభివృద్ధి చేస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పరిశ్రమలు స్థాపించలేకపోయామని, అందుకు భూములు లేవని చెప్పారు. రాజీనామా పేరుతో బెదిరించడం సరికాదన్నారు. ధర్నా ఇక్కడ కాదు, ఢిల్లీలో చేయాలని హితవు పలికారు. పోలవరం నిధుల కోసం రాజీనామా చేయాలన్నారు. 

చంద్రబాబుతో ఒడిశా ఎంపీ సౌమ్యారంజన్‌ పట్నాయక్‌ భేటీ
సీఎం చంద్రబాబుతో ఒడిశాకు చెందిన ఎంపీ సౌమ్యా రంజన్‌ పట్నాయక్‌ మంగళవారం భేటీ అయ్యారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రతినిధిగా వచ్చిన ఆయన చంద్రబాబును కలసి పలు అంశాలపై చర్చించారు. మహిళా రిజర్వేషన్లు, ఈవీఎం మిషన్లు వంటి అంశాలపై ప్రస్తావించారు. 

మరిన్ని వార్తలు