‘సాయుధ’ వ్యాఖ్యలపై చర్యలు: ఈసీ

25 Apr, 2019 05:17 IST|Sakshi

న్యూఢిల్లీ: రాజకీయ నేతలు తమ ఎన్నికల ప్రచారంలో సాయుధబలగాలను వాడుకోవడంపై కేంద్రం ఎన్నికల సంఘం(ఈసీ) స్పందించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నేతలపై చర్యలు తీసుకోవాలని దాఖలైన ఫిర్యాదులపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని ఈసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భారత సైన్యాన్ని ‘మోదీజీ సైన్యం’గా అభివర్ణించిన కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, యూపీ సీఎం యోగిలను భవిష్యత్తులో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందిగా హెచ్చరించామని వెల్లడించారు. బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ఇటీవల పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన ‘మోదీజీ వాయుసేన’ వ్యాఖ్యలపై విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. కొన్ని ఫిర్యాదులపై సత్వరం చర్యలు తీసుకుంటున్న ఈసీ మరికొన్ని విషయాల్లో అలసత్వం వహిస్తోందన్న విమర్శలపై స్పందిస్తూ..‘రాజకీయ నేతల ఒక్కో ప్రసంగం ఒక్కో సందర్భాన్ని ఉద్దేశించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దీనర్థం మేం ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని కాదు’ అని అన్నారు. ‘బాలాకోట్‌ వీరుల’కు ఓటు వేయాలంటూ మొదటిసారి ఓటర్లకు మోదీ పిలుపునిచ్చినట్లు అందిన ఫిర్యాదును పరిష్కరించినట్లు ఈసీ తెలిపింది.

మరిన్ని వార్తలు