రాజకీయాల్లోకి వచ్చి పెద్ద తప్పుచేశా.. మళ్లీ రాను

30 Jul, 2019 20:11 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ సీఎం జయలలిత మేనకోడలు దీప జయకుమార్‌ రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఆమె చెన్నైలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వచ్చి అన్ని పోగొట్టుకున్నానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్య సమస్యల కారణంగా తాను రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు తెలిపారు. తన జీవితంలో రాజకీయాల్లోకి రావడమే తాను చేసిన పెద్ద తప్పని ఆవేదన చెందారు. జన్మలో తిరిగి మళ్లీ రాజకీయాల్లోకి రానని ఆమె స్పష్టం చేశారు.

కాగా జయలలిత మరణం తర్వాత ఆమె రాజకీయ వారసత్వంపై అన్నాడీఎంకే నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. జయలలిత‌కు నిజమైన రక్త వారసురాలు తానేనంటూ ఆమె అన్న కుమార్తె దీప రాజకీయాల్లో ప్రవేశించారు. అన్నాడీఎంకే కార్యకర్తలు, జయలలిత అభిమానులు తన వైపు నిలపుకునేందుకు అప్పట్లో అమె పెద్ద ప్రయత్నమే చేశారు. ఈ నేపథ్యంలోనే దీపా ‘ఎంజీఆర్ అమ్మా దీపా పేరవై’ అనే రాజకీయ పార్టీని కూడా నెలకొల్పారు. కానీ అభిమానుల నుంచి అనుకున్నంత మద్దతు లేకపోవడంతో ఆమె తీవ్ర నిరాశ చెందారు. దీంతో రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. 
 

మరిన్ని వార్తలు