ఒక్క మహిళను ఓడించడానికి ఇన్ని కుట్రలా?

3 Oct, 2019 08:10 IST|Sakshi
మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

సాక్షి, భువనగిరి: హుజూర్‌నగర్‌లో ఒక్క మహిళను ఓడించేందుకు ఇన్ని కుట్రలు చేయడం అవసరమా అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం భువనగిరిలోని రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 80 మంది ఎమ్మెల్యేలు, 700 మంది ఎంపీపీలు, జెడ్పీటీసీలు గ్రామాల్లో తిరుగుతూ డబ్బులు వెదజల్లుతూ ఓట్లను కొనుగోలు చేస్తున్నారన్నారు. ఇలా ఎన్ని చేసినా ఓడిపోతామనే భయం టీఆర్‌ఎస్‌కు పట్టుకుందని, అందుకే సీపీఐ మద్దతు తీసుకున్నారని ఆరోపించారు. హుజూర్‌నగర్‌ ప్రజలు ప్రశ్నించే గొంతును, పోరాడే వారిని గెలిపించాలని చూస్తున్నారని తెలిపారు. రేపటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గ్రామాల్లో తాము కూడా పర్యటిస్తామన్నారు.

రాష్ట్రంలో డెంగీ వంటి అనేక వ్యాధులతో పెద్ద, చిన్న మరణిస్తున్నారని, దీనిపై న్యాయస్థానం ప్రభుత్వాన్ని చీవాట్లు పెట్టిందని గుర్తు చేశారు. జిల్లా ఆస్పత్రులలో సౌకర్యాలు లేవని, ఆలేరు ఏరియా ఆస్పత్రిలో కూలర్లు లేక మృతదేహానికి మూడు రోజుల వరకు పోస్టుమార్టం చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. సచివాలయ కూల్చివేతలపై హైకోర్టు తీర్పు సీఎం కేసీఆర్‌కు చెంపపెట్టు లాంటిదన్నారు. ఆ తీర్పుతో న్యాయస్థానంపై మరింత గౌరవం పెరిగిందని, న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్‌ దేశంలో ఎక్కడా లేని విధంగా గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం రావాలని కొత్త ఒరవడికను సృష్టించి 500 సేవలను ఒకే కార్యాలయం నుంచి అమలు చేయాలని ముందుకు సాగుతున్నారని కొనియాడారు. అలా తక్కువ బడ్జెట్‌తో పాలనపై పట్టును సాధిస్తున్నారన్నారు. సమావేశంలో పీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పొత్నక్‌ ప్రమోద్‌కుమార్, నియోజకవర్గ నాయకులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బర్రె జహంగీర్, వల్లందాసు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.     

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా