ఆ పార్టీ మ్యానిఫెస్టోతో దేశ భద్రతకు ప్రమాదం

3 Apr, 2019 16:17 IST|Sakshi
కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోపై బీజేపీ విమర్శలు.. ప్రతీకాత్మక చిత్రం

ఉగ్రవాదులకు, వేర్పాటువాదులకు అనుకూలంగా మ్యానిఫెస్టో.. 

ఏఎఫ్‌ఎస్పీఏ నిర్వీర్యం చేస్తే.. భద్రతా దళాల నైతిక స్థైర్యం దెబ్బతింటుంది

సాక్షి, న్యూఢిల్లీ :  లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టోపై రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు, వేర్పాటువాదులకు అనుకూలంగా కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టో ఉందని విమర్శించారు. వివాదాస్పద సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్‌ఎస్పీఏ) నిర్వీర్యం చేస్తే.. దేశ భద్రతా వ్యవస్థ ప్రమాదంలో పడే అవకాశముందని ఆమె బుధవారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.  ఏఎఫ్‌ఎస్పీఏను సమీక్షిస్తామని, జమ్మూకశ్మీర్‌లోన్ని అన్ని వర్గాల వారీతో బేషరతుగా చర్చలు జరుపుతామని కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం ప్రకటించిన మ్యానిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో సాయుధ బలగాలను బలహీనపరిచేలా ఉందని, భదత్రా బలగాలకు ఉన్న రక్షణ పొరను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తోందని ఆమె మండిపడ్డారు. ‘ఏఎఫ్‌ఎస్పీఏను నిర్వీర్యం చేసి.. భద్రతా దళాలను నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. జిల్లా మేజిస్ట్రేట్ల అధికారాలు తగ్గించాలని ఆ పార్టీ భావిస్తోంది. దేశద్రోహం చట్టాన్ని ఎత్తివేయాలని కోరుతోంది’ అని ఆమె అన్నారు. అయితే, నిర్మలా సీతారామన్‌ విమర్శలను కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోను రూపొందించిన కేంద్ర మాజీ హోంమంత్రి చిదంబరం తోసిపుచ్చారు. ఐదేళ్లు అధికారుంలో ఉన్న బీజేపీ రెండు కీలకమైన విషయాల (ఏఎఫ్‌ఎస్పీఏ, జమ్మూకశ్మీర్‌)పై ఉదాసీన వైఖరితో భారత్‌కు ఉగ్రవాద దాడులకు ఆలవాలంగా మారుస్తోందని విమర్శించారు.
 

మరిన్ని వార్తలు