సరుకుల సంచికి చిల్లు

14 Mar, 2019 07:58 IST|Sakshi
  • 2014 ఎన్నికల నాటికి  రాష్ట్రంలో ఉన్న తెల్లరేషన్‌ కార్డులు 1.44 కోట్లు (అంచనా)
  • చంద్రబాబు వచ్చిన తర్వాత తొలగించిన రేషన్‌ కార్డుల సంఖ్య 24 లక్షలు (అంచనా)
  • నాలుగున్నరేళ్లపాటు విచ్చలవిడిగా రేషన్‌ కార్డులను తొలగించి పేదలను తీవ్ర ఇబ్బందులు పెట్టిన  ప్రభుత్వం ఎన్నికల కోసం కొత్త రేషన్‌ కార్డులు జారీ చేస్తోంది. 
  • వేలి ముద్రలు సరిగా పడనందున లబ్ధిదారులు సరుకులు తీసుకోకపోవడం, వలస కూలీలు స్థానికంగా లేకపోవడంతో దాదాపు రూ. 1500 కోట్ల విలువైన బియ్యం, ఇతర సరుకులు ఆదా అయ్యాయని ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. 
  • అయితే పేదలకందని రేషన్‌ సరుకులను వారికి చేర్చాలని రాష్ట్రప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయకపోవడం గమనార్హం

టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలో పేదలు, సామాన్యులపై టీడీపీ ప్రభుత్వం సంధించిన అస్త్రాల్లో ఒకటి 24 లక్షల రేషన్‌ కార్డులను తొలగించడం. ఆధార్‌ కార్డుల అనుసంధానం పేరిట, పొట్టకూటికోసం తాత్కాలికంగా వలస వెళ్లిన పేదలు స్థానికంగా ఉండటం లేదన్న సాకుతో నిర్దాక్షిణ్యంగా కార్డులు రద్దు చేశారు. ఇష్టారాజ్యంగా రేషన్‌ కార్డుల తొలగింపుపై అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినా చంద్రబాబు సర్కారు స్పందించలేదు. దాదాపు నాలుగున్నరేళ్లు వారికి అన్యాయం చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు రావడంతో అడిగినా, అడగకపోయినా రేషన్‌ కార్డులు మంజూరు చేయాలని ఆదేశాలు జారీచేసింది. అర్హులైన పేదలు దరఖాస్తులు చేసుకోకపోయినా.. గతంలో నిర్వహించిన ప్రజా సాధికార (పల్స్‌) సర్వేలో నమోదైన వివరాల ప్రకారం కొత్తగా రేషన్‌ కార్డులను జారీ చేసే బాధ్యతను రియల్‌ టైం గవర్నెన్స్‌ (ఆర్టీజీఎస్‌)కు అప్పగించింది. రేషన్‌ కార్డు కావాలని అడిగినా, అడగకపోయినా ఇచ్చేయమంటూ ప్రభుత్వం చేసిన హడావుడి వల్ల కొన్ని జిల్లాలో ఐటీ అధికారులు, న్యాయవాదులు, గెజిటెడ్‌ అధికారులకు కూడా రేషన్‌ కార్డులు ఇచ్చేశారు. ఇదంతా ఎన్నికల గిమ్మిక్కేనని సులువుగా అర్థమవుతుంది.  

పేదల కడుపు కొట్టిన టీడీపీ ప్రభుత్వం 
2014 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 1.44 కోట్ల తెల్లరేషన్‌ కార్డులు ఉన్నాయని అంచనా. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. కుటుంబాల కంటే కార్డులే ఎక్కువ ఉన్నాయని చెప్పి నకిలీల తొలగింపు పేరిట అసలైన లబ్ధిదారుల కార్డుల్ని తొలగించారు. కొద్ది రోజుల పనుల కోసం కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు వలస వెళ్లిన పేదలు స్థానికంగా లేరని చెప్పి వారి కార్డుల్ని రద్దుచేశారు. ఆధార్‌ కార్డు అనుసంధానం కాలేదని, ఈ–పాస్‌ మిషన్లలో వేలి ముద్రలు సరిగా పడలేదని ఇలా పలు సాకులు చూపించి స్థానికంగా ఉన్న లక్షలాది మంది కార్డుల్ని అకారణంగా తొలగించారు. అలా లెక్కా పత్రం లేకుండా రేషన్‌ కార్డుల్ని తొలగించి బియ్యం ఇవ్వకుండా ప్రభుత్వం పేదల కడుపు కొట్టింది. ఆర్థిక భారం తగ్గించుకునే ఎత్తుగడలో భాగంగా సబ్సిడీ బియ్యాన్ని పేదలకు అందకుండా చేశారు. 2015, ఏప్రిల్‌ నుంచి రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఈ–పాస్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీంతో రేషన్‌ కార్డులో పేర్లు నమోదైన వారిలో ఒకరు తప్పని సరిగా రేషన్‌ షాపునకు వెళ్లి వేలి ముద్రలు వేస్తేనే సబ్సిడీ బియ్యంతో పాటు ఇతర సరుకులు ఇస్తారు. వేలి ముద్రలు సరిగా పడనందున లబ్ధిదారులు సరుకులు తీసుకోకపోవడం, వలస కూలీలు స్థానికంగా లేకపోవడంతో దాదాపు రూ. 1500 కోట్ల విలువైన బియ్యం, ఇతర సరుకులు ఆదా అయ్యాయని ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. రేషన్‌ కార్డుల తొలగింపుపై పేదలు, సామాన్యుల ఆందోళనలతో ప్రభుత్వం దిగివచ్చింది. రద్దు చేసిన కార్డుల్ని పునరుద్ధరిస్తున్నామని చెప్పకుండా.. తమ ప్రభుత్వం కొత్తగా రేషన్‌ కార్డులు మంజూరు చేస్తుందని ప్రచార ఆర్భాటం మొదలుపెట్టారు. ఏడాదికి ఒకసారి ప్రభుత్వం నిర్వహించే జన్మభూమి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కొత్త కార్డుల్ని మంజూరు చేస్తూ వచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కొత్తగా లక్షలాది కార్డులు మంజూరు చేశామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం.. నాలుగున్నర ఏళ్ల పాటు వారి కార్డులను రద్దు చేసి సరుకులు ఇవ్వకుండా మోసం చేసింది. ఇప్పుడు కొత్తగా ఇచ్చే కార్డులు కేవలం ఎన్నికల కోణంలోనే అన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.  – రాజగోపాల్, సాక్షి, అమరావతి

2014 వరకు రేషన్‌ కార్డులు, టీడీపీ అధికారంలోకి వచ్చాక తొలగించిన కార్డుల వివరాలివి.. 


  

మరిన్ని వార్తలు